అసంపూర్తిగా భవనం.. పాఠశాలలో పంచాయతీ

26-09-2026 | 05:40am

కేసముద్రం, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీకి భవన నిర్మాణం చేపట్టి అభ్యంతరంగా వదిలేయడంతో పాఠశాలలో పంచాయతీ నిర్వహిస్తున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో చోటుచేసుకుంది. నెల్లికుదురు మండలం చిన్న ముప్పారం శివారు గ్రామంగా ఉన్న నారాయణపురం గ్రామాన్ని దశాబ్ద కాలం క్రితం నూతన పంచాయతీగా ఏర్పాటు చేసి కేసముద్రం మండలంలో విలీనం చేశారు.

కొంతకాలం గ్రామంలోని ప్రైవేటు వ్యక్తి ఇంట్లో పంచాయతీ కార్యాలయాన్ని నిర్వహించిన తర్వాత సొంత భవనం నిర్మించడానికి మాజీ సర్పంచ్ ఊకంటి యాకూబ్ రెడ్డి తన వ్యవసాయ భూమిని నిదానంగా ఇచ్చి 2018లో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 13 13 లక్షల రూపాయల నిధులతో పంచాయితీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. భవన నిర్మాణం ప్రస్తుతం స్లాబ్ పనులు పూర్తి చేసి ప్లాస్టింగ్ పనులు కూడా చేశారు. ఫ్లోరింగ్, రంగులు, ఇతర ఫర్నిచర్ సౌకర్యాలు సమకూర్చాల్సి ఉంది.

అయితే ఇప్పటివరకు మిగిలిన పనులను చేపట్టకుండా వదిలేయడంతో కొత్త భవనం ఎందుకు పనికి రాకుండా పిచ్చి మొక్కల మధ్య అలంకారప్రాయంగా మారింది. దీంతో ప్రస్తుతం పంచాయతీ కార్యాలయ నిర్వహణను పాఠశాలలో గదిలో నిర్వహిస్తున్నారు. లక్షలు పోసి నిర్మించిన భవనం నిర్లక్ష్యంగా వదిలేయడం పట్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తి భవనాన్ని పూర్తి చేసి పంచాయతీ కార్యాలయ నిర్వహణను కొత్త భవనంలో చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు