రూ.45 కోట్ల సర్కార్‌ భూమి...సర్వే కష్టమా..?

15-09-2026 | 12:33pm

మణికొండలో రూ.45 కోట్ల ప్రభుత్వ భూమి పరిరక్షణపై ప్రశ్నలు

సర్వే నంబర్‌ 42లో 1,400 గజాల స్థలం

కలెక్టర్‌ విచారణకు సీతారాం ధూళిపాల డిమాండ్‌

మణికొండ, సెప్టెంబర్‌ 15 (విజయక్రాంతి): మణికొండ జాగీర్‌ పరిధి(Manikonda Jagir jurisdiction)లోని సర్వే నంబర్‌ 42లో ఉన్న సుమారు 1,400 చదరపు గజాల ప్రభుత్వ భూమి పరిరక్షణపై తెలంగాణ యునైటెడ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్స్‌ (యూఎఫ్‌ఆర్‌డబ్ల్యూఏ) రాష్ట్ర అధ్యక్షుడు సీతారాం ధూళిపాల ప్రశ్నలు లేవనెత్తారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ సుమారు రూ.45 కోట్లుగా అంచనా వేస్తున్న ఈ భూమిని కాపాడటంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

20 ఏళ్లుగా పరిష్కారం లేదా..?

సుమారు 20 ఏళ్లుగా ఈ ప్రభుత్వ భూమికి సంబంధించిన సమస్య కొనసాగుతున్నప్పటికీ, పలుమార్లు ఫిర్యాదులు చేసినా పరిష్కారం లభించలేదని సీతారాం ధూళిపాల తన ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. 2005లోనే ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదైందని, ఆ సమయంలో అక్కడ కంచె, ప్రభుత్వ భూమి బోర్డు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ, ప్రస్తుతం ఆ స్థలాన్ని పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు.

ప్రైవేటు స్థలాల సర్వేకు ప్రాధాన్యమా..?

ప్రైవేటు స్థలాలను సర్వే చేసి గుర్తించడంలో చురుకుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ యంత్రాంగం, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ధూళిపాల ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిని కాపాడటంలో విఫలమైన అధికారులపై బాధ్యతను ఎందుకు నిర్ణయించడం లేదని, ఇంతకాలం చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలపై విచారణ జరపాలని కోరారు.

కలెక్టర్‌ తక్షణమే విచారణ జరపాలి

రంగా రెడ్డి జిల్లా కలెక్టర్‌ వెంటనే ఈ వ్యవహారంపై విచారణ జరిపి, సర్వే నంబర్‌ 42లోని 1,400 చదరపు గజాల స్థలం ప్రస్తుత పరిస్థితి, స్వాధీన వివరాలను పరిశీలించాలని సీతారాం ధూళిపాల విజ్ఞప్తి చేశారు.సంబంధిత భూమికి సమగ్ర సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించి, కంచె ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆస్తిని పరిరక్షించాలని కోరారు. భూమి పరిరక్షణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని, విచారణలో వెల్లడైన వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులని, వాటి పరిరక్షణ రెవెన్యూ అధికారుల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు