వినాయక విగ్రహం విషయంలో ఘర్షణ.. డ్రైవర్ మృతి
దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన డ్రైవర్
ఘట్ కేసర్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): వినాయక విగ్రహం కొనుగోలు విషయంలో తలెత్తిన చిన్నపాటి వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసి ఒకరి ప్రాణం తీసింది.విగ్రహ విక్రేతలు, కొనుగోలుదారుల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చౌదరిగూడ ప్రాంతానికి చెందిన పసులాది కిరణ్ (34) డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కిరణ్(Kiran) ఆరుగురు మిత్రులతో కలిసి సూర్య ఆస్పత్రి ఎదురుగా ఏర్పాటు చేసిన తాత్కాలిక వినాయక విగ్రహాల విక్రయ కేంద్రానికి వెళ్లాడు.
విగ్రహం ధర విషయంలో కిరణ్ బృందానికి, విక్రేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం పరస్పర దాడులకు దారితీయడంతో ఇరువర్గాలు అక్కడ ఉన్న వెదురు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో విగ్రహ విక్రేతలు కిరణ్ పై వెదురు కర్రలు, చేతులతో దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం సమీపంలోని సూర్య ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో డ్రైవర్ కిరణ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.