మహా భూస్కామ్

12-09-2026 | 05:30am
  1. రాష్ట్రంలో విపరీతంగా ల్యాండ్ చోరీ 
  2. ఇందిరమ్మ రాజ్యంలో గజానికో గజదొంగ 
  3. సీఎం బాగోతాలు బయటపెడతామనే.. సభ నుంచి గెంటేశారు 
  4.   16 లక్షల ఎకరాల నుంచి 1.16 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలోకి 
  5. రూ. 200 కోట్ల విలువ చేసే భూములను రూ. 7 కోట్లకే కట్టబెట్టారు 
  6. ప్రజలకు మానసిక ప్రశాంతత లేకుండా పోయింది 
  7. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యం(Indiramma Rule)లో భూములు దోచుకుంటున్నారని, ఈ ప్రభుత్వం లో గజానికి ఒక గజ దొంగ ఉన్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఆరోపించారు. రాష్ట్రంలో ల్యాండ్ చోరీ విపరీతంగా జరుగుతుందన్నారు. రాష్ట్రం లో కోటి ఎకరాలను నిషేధిత జాబితా(Prohibited list)లో ఈ ప్రభుత్వం పెట్టిందని, సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) హారతి కర్పూరంలా భూములను కాజేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఇప్పటివరకు జరగని మహా భూ కుంభకోణం(Massive Land Scam) ఇది అని ఆయన అన్నారు.

సీఎం బాగోతాలు బయటపడుతాయనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల(BRS MLAs)ను సభ నుంచి సస్పెండ్(Suspend) చేసి, మెడ పట్టి గెంటేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో 22 ఏ నిషేధిత జాబితా వ్యవహా రంపై మాజీ మంత్రి హరీశ్(Former Minister Harish Rao)  పవర్‌పాయింట్ ప్రజెంటేషన్(PowerPoint presentation) ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2014లో రాష్ట్రంలో భూములు కొనాలంటే మానసిక అనుమానాలు అనేకం ఉండేవని, కేసీఆర్ సీఎం అయిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులకు నీళ్లు ఇవ్వడంతో ఎకరం రూ. 5 లక్షలు  ఉండే భూమి రూ. 50 లక్షలు అయిందని గుర్తు చేశారు.

బీఆర్‌ఎస్ హయంలో 16 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండేవని, ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత కోటి 16 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారని విమర్శించారు. సీఎం బ్రదర్స్ భూములను కొల్లగొడుతున్నారని, మంత్రుల ముఠా అలీ బాబా అరడజన్ దొంగల్లా తయారు అయ్యారని ఎద్దేవా చేశారు. మంత్రుల వాటాల్లో భాగంగా మంత్రి పదవి నుంచి ఒకరిని బర్తరఫ్ చేశారని వెల్లడించారు. తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు అన్నట్టు సీఎం బ్రదర్స్ దోచుకుంటున్నారని మండిపడ్డారు.

సమాంతర రెవెన్యూ వ్యవస్థ రాష్ట్రంలో జరుగుతుందని, అల్లుడు కోసం గిరిజన భూములను లాక్కునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఆర్‌టీఐని అడ్డంపెట్టుకొని రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసేవారని, వీరప్పన్ అటవీ శాఖ మంత్రి అయితే ఎలా ఉంటుందో, రేవంత్ రెడ్డి అనే బ్లాక్ మెయిలర్ సీఎం అయితే అలానే ఉందన్నారు. అత్తసొమ్ము అల్లుడికి దానం చేసినట్లు నగరం నడిబొడ్డున ఉన్న పారిశ్రామిక భూ ములను అమ్మేస్తున్నారని, రేవంత్ రెడ్డి అనుచరులకు నగరం నడిబొడ్డున ఉన్న భూములను కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూసీ సుందరీకరణ పేరుతో వేల ఎకరాలను అమ్ముకుంటున్నారని, ఫ్యూచర్ సిటీలో రూ. 200 కోట్ల విలువ చేసే భూములను రూ. 7 కోట్లకే కట్టబెట్టారని ఆరోపించారు. సిరిసిల్ల నియోజకవర్గం సముద్ర లింగాపురం ఊరిలో 800 ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారని, రాష్ట్ర ప్రజలకు మానసిక ప్రశాంతత లేకుండా పోయిందని ఆవేనద వ్యక్తం చేశారు. కొంగర కలాన్‌లో కేసీఆర్ వచ్చిన తరువాత కలెక్టరేట్ నిర్మించారని, కొంగర కలాన్ భూముల రేటు విపరీతంగా పెరిగిందని గుర్తు చేశారు.

ఎకరానికి రూ. 15 కోట్లకు ఇస్తామని, నూరు ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారని చెప్పారు. అంతర్జాతీయ కంపెనీకి నేను లేఖ రాస్తానని, గతంలో నేను ఐటీ శాఖ మంత్రిగా పనిచేశానని చెప్పారు. అంతర్జాతీయ కంపెనీ వాళ్లను, బిల్డర్లను బెదిరించి కమిషన్‌లు వసూల్ చేస్తున్నారని ఆరోపించారు. కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టడాన్ని రాహుల్ గాంధీకి తెలియజేస్తామని, సీఎంగా రెండేళ్లలో కేసీఆర్ వచ్చేది ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. నిషేధిత జాబితాలో పెట్టిన భూములను కాపాడుకుందామని భరోసా ఇచ్చారు. 

33 జిల్లాల కలెక్టర్ల లేఖలు బయట పెడతాం..

1908లో బ్రిటిష్ కాలంలో నిర్దిష్టమైన భూములను నిషేధించేందుకు 22-ఏ నిబంధన తీసుకొచ్చారని తెలిపారు. ప్రభుత్వ, పోరంబోకు భూములు, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్ భూములు, దేవాదాయ, వక్ఫ్ భూములు, భూసీలింగ్ కింద ప్రభుత్వానికి సంక్రమించిన భూములను పరిరక్షించడమే దాని ఉద్దేశమని చెప్పారు. కానీ ఇప్పుడు గ్రామాలకు గ్రామాలు, కాలనీలు, అపార్ట్మెంట్లు, హౌసింగ్ సొసైటీలు, గతంలో ప్రభుత్వ సంస్థలు వేలం వేసిన భూములు కూడా నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని హౌసింగ్ సొసైటీలు, షేక్‌పేట్ ప్రాంతం, అమీన్పూర్ తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 22-ఏ జాబితా తయారీకి సంబంధించి 33 జిల్లాల కలెక్టర్ల లేఖలను బయటపెడతామని ప్రకటించారు. 2025 సెప్టెంబర్ 11న కొత్త ప్రొహిబిషన్ లిస్ట్ తయారు చేయాలని ఆదేశాలు వచ్చాయని, నవంబర్‌లో కొన్ని జిల్లాల కలెక్టర్లు జాబితాలు రూపొందించారని, అనంతరం గెజిట్లు విడుదలయ్యాయని ఆరోపించారు.

సిర్పూర్--కాగజ్‌నగర్ నియోజకవర్గంలో 30 వేల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారని, మంచిర్యాల నియోజకవర్గంలో 11 వేల ఇళ్లు ప్రభావితమ య్యాయని పేర్కొన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తనకు వేలాది దరఖాస్తులు వచ్చాయని, వాటిని అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి ముందు పెట్టాలని భావించామని చెప్పారు. భూ భారతి పోర్టల్లో వక్ఫ్, దేవాదాయ భూములకు సంబంధించిన పూర్తి వివరాలు కనిపించడం లేదని ఆరోపించారు.

ప్రభుత్వానికి సం బంధించిన భూముల వివరాలు అందుబాటులో లేకపోయినా, ప్రజల భూములను మాత్రం నిషేధిత జాబితాలో చేర్చారని విమర్శించారు. ఈ వ్యవహారంలో అధి కారులపై ఒత్తిడి తెచ్చి జాబితాలు తయారు చేయించారని ఆరోపించారు. ‘తప్పు 33జిల్లాల కలెక్టర్లదేనా? ప్రభుత్వ ఆదేశం లేకుం డానే ఇంత పెద్దఎత్తున భూములను 22-ఏలో చేర్చారా? అధికారులు తప్పుచేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?’ అని ప్రశ్నించారు. 

సీఎం ఇల్లు 22 -ఏలోకి..

సీఎం రేవంత్‌రెడ్డి నివాసం కూడా 22 -ఏ జాబితాలో చేరిందని, ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత రాత్రికి రాత్రే దానిని జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. ‘ముఖ్యమంత్రి ఇల్లు 22-ఏలో ఉంటే తొలగించగలిగారు. మరి సామాన్యుల భూములను ఎందుకు తొలగించలేరు?’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన తప్పుకు ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలని నిలదీశారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూములను ప్రభుత్వం స్వయంగా తొలగించాలని, బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పకూడదని డిమాండ్ చేశారు.

భూముల వివరాలు, చేర్చినవి, తొలగించినవి, తొలగింపునకు కారణాలు అన్నింటినీ ప్రజలకు బహిరంగంగా వెల్లడించాలని కోరారు. 22-ఏ వ్యవహారంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ‘చీమూ నెత్తురు, సిగ్గు ఉంటే పొంగులేటి వెంటనే రాజీనామా చేయాలి. నైతికత ఉంటే పదవిలో కొనసాగకూడదు’ అన్నారు. తాను చేసిన తప్పును అధికారులపైకి నెట్టేసి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

నాదర్‌గుల్‌లో 373 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ మంత్రి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులపై ఆయన పలు ఆరోపణలు చేశారు. ఆ భూమి ప్రభుత్వానిదేనని సంబంధిత న్యాయపరమైన ప్రక్రియల్లో వెల్లడైందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పసుమాముల, ఖాజాగూడ తదితర ప్రాంతాల్లోనూ భూముల వ్యవహారాలపై ఆరోపణలు చేశారు.

భూ భారతి పేరుతో భూ వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. 22-ఏ భూముల వ్యవహారంపై ఆధారాలను అసెంబ్లీలో బయటపెట్టేందుకు సిద్ధమయ్యామని, అందుకే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. బాధితుల నుంచి వచ్చిన వేలాది దరఖాస్తులను సభలో పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకున్నామని చెప్పారు. ‘మమ్మల్ని అసెంబ్లీకి రాకుండా చేసినా వదిలిపెట్టం.

అరెస్టు చేసినా వెనక్కి తగ్గం. బాధితుల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుంది’ అని స్పష్టం చేశారు. 22-ఏలో చేర్చిన భూములపై బేషరతుగా నిషేధం తొలగించాలని, మొత్తం వ్యవహారంపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘మీకు రియల్ ఎస్టేట్ తెలుసు.. మాకు పోరాటాలు తెలుసు. సర్కారు మెడలు వంచి 22-ఏను తొలగించే వరకు పోరాటం ఆగదు’ అని హెచ్చరించారు. 

ఆయా జిల్లాల నుంచి బాధితులు.. 

తెలంగాణ భవన్‌లో 22 ఏ వ్యవహారంపై హరీష్‌రావు ప్రజెంటేషన్ సందర్భంగా ఆయా జిల్లాల నుంచి బాధితులు తరలివచ్చారు. బాధితులు తమ భూములు నిషేధిత జాబితాలో చేరడంతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేటీఆర్, హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లి తమ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవని, కాంగ్రెస్ రాగానే మా భూములు కబ్జా పెట్టారని బాధపడ్డారు. తమకు అండగా ఉండాలంటూ బీఆర్‌ఎస్ పార్టీని కోరారు.

తెలంగాణ భవన్‌కు వచ్చిన వారిలో ఇస్రో సైంటిస్ట్ హను మంతరావు, కూకట్‌పల్లి నుంచి కృష్ణారెడ్డి, ఎల్బీ నగర్ నుంచి సీతారాంరెడ్డి, గోపాల్‌రావు, కుత్బుల్లాపూర్ నుంచి బాలరాజు, సత్తిరెడ్డి, పటాన్‌చెరు నుంచి విజయ్‌రాజ్, సంజీవరెడ్డి, దాసు, ఆసిఫాబాద్ నుంచి మల్లేశ్, జయరాం, కరీంనగర్ నుంచి మోహన్‌రెడ్డి, రాజశేఖర్, యాదాద్రి భువనగిరి నుంచి రామనర్సయ్య, నీలం ఓం ప్రకాశ్‌రావు, మంచిర్యాల నుంచి సురేందర్‌రెడ్డి, ఫిర్జాదీగూడ నుంచి ఆకుల సత్యనారాయణ, ఈసీఐఎల్ నుంచి సోమశేఖర్‌రెడ్డి కాగజ్‌నగర్ నుంచి భీంబాయి, విజయలక్ష్మీ, రాం దాస్‌పల్లి నుంచి శ్రీనివాస్, ప్రకాశ్, తుర్కంజాయల్‌నుంచి సురేందర్‌రెడ్డి, రాంనగర్ నుంచి వెంకటేశ్వర్‌రావు ఉన్నారు.

పొంగులేటి రాజీనామా చేయాలి.. 

రాష్ట్రంలో 22-ఏ నిషేధిత జాబితా వెనుక భారీ భూదందా, రాజకీయ కుట్ర ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర జ్యుడిషియల్ విచారణ జరిపిం చాలని డిమాండ్ చేశారు. నైతికత ఉంటే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 22-ఏ వ్యవహారంలో సీఎం రేవంత్‌రెడ్డికి కూడా సంబంధం ఉందని, ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 పొంగులేటి అని ఆరోపించారు.

22ఏ నిషేధిత జాబితా భూముల అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. ‘నిన్నటి వరకు అది మీ భూమి.. తెల్లారేసరికి నిషేధిత భూమిగా మారింది. ఒక్క కలం పోటుతో లక్షలాది మంది ప్రజల ఆస్తులను జీరో వాల్యూగా చేశారు’ అని విమర్శించారు. తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను నిషేధిత జాబితాలో పెట్టడంతో ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని అన్నారు.

ఒక సేల్‌డీడ్ ఆగిపోవడం అంటే ఒక కుటుంబంలో పెళ్లి ఆగిపోవడం, పిల్లల చదువు ఆగిపోవడం, వైద్యానికి అవసరమైన డబ్బు అందకపోవడం వంటిదేనని పేర్కొన్నారు. ‘ఒక రైతుకు భూమి జీవనాధారం. మధ్యతరగతి కుటుంబానికి పిల్లల భవిష్యత్తుకు భరోసా. తండ్రికి కూతురి పెళ్లికి దాచుకున్న ఆస్తి. తల్లిదండ్రులకు పిల్లల చదువులకు పెట్టుకున్న భరోసా. అలాంటి భూములపై ప్రభుత్వం అనిశ్చితి కత్తిని వేలాడదీసింది’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు