చదువు చెప్పాల్సిన వేళ.. బడులకు తాళం!

12-09-2026 | 04:45am

ఉపాధ్యాయ దినోత్సవం పేరుతో విద్యార్థులకు నష్టం

ఎంఈఓ మౌళిక ఆదేశాలతో పాఠశాలలు మూసివేశారన్న ఆరోపణలు

పిల్లలను బడికి పంపిన తల్లిదండ్రులు.. ఇళ్లకు వెళ్లేసరికి తాళాలు

పాపన్నపేట, సెప్టెంబర్11: ఉపాధ్యాయ దినోత్సవం(Teachers Day).. ఉపాధ్యాయులకు సన్మానం.. మరి విద్యార్థుల సంగతేంటి? ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల(Government Schools)ల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటే.. మరోవైపు క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న నిర్ణయాలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఉపాధ్యాయ దినోత్సవ వేడుక సందర్భంగా పాపన్నపేట మండలంలోని పాఠశాలలకు మధ్యాహ్నం నుంచే సెలవు ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తూ వారి సేవలను గుర్తించడం జరుగుతుంది. అయితే పాపన్నపేట మండలంలో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 11న శుక్రవారం కొత్తపల్లి ఫంక్షన్హాల్లో నిర్వహించారు.

కార్యక్రమానికి ప్రతి పాఠశాల నుంచి కొంతమంది ఉపాధ్యాయులు హాజరయ్యేలాచేసి.. మిగిలిన ఉపాధ్యాయులతో విద్యార్థులకు తరగతులు నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ, మధ్యాహ్నం నుంచే పాఠశాలలను మూసివేయాలని మండల విద్యాధికారి మౌఖికంగా ఆదేశించినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో మండలంలోని పలు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మధ్యాహ్నం నుంచే మూతపడ్డాయని చెబుతున్నారు. 

బడికి పంపిన పిల్లలకు.. ఇంటి తాళాలు!

అసలు సమస్య ఇక్కడే మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది తల్లిదండ్రులు ఉదయాన్నే పిల్లలను పాఠశాలకు పంపి వ్యవసాయ పనులకు వెళ్తారు. పిల్లలు సాయంత్రం వరకు బడిలో ఉంటారన్న నమ్మకంతో తల్లిదండ్రులు తమ పనులకు వెళ్తారు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మధ్యాహ్నానికే పాఠశాలలు మూసివేయడంతో పిల్లలు ఇంటికి చేరుకునే సమయానికి ఇళ్లకు తాళాలు కనిపించిన ఘటనలు చోటుచేసుకున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. చిన్నారులు ఇంటికి వెళ్లలేకపోతే ఎక్కడికి వెళ్లాలి? ఎవరి పర్యవేక్షణలో ఉండాలి?

ఇదే ఇప్పుడు తల్లిదండ్రులను కలవరపెడుతున్న ప్రశ్న

పిల్లల భద్రతకు ఎవరు బాధ్యత?

తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో చిన్నారులు పొలాల వైపు వెళ్లడం.. ఆటల కోసం చెరువులు, కుంటలు, బావుల సమీపానికి చేరడం జరిగితే పరిస్థితి ఏంటి? తెలిసి తెలియని వయసులో ఉన్న పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ముందస్తుగా పాఠశాలలకు మధ్యాహ్నం సెలవు ఉంటుందని సమాచారం ఇచ్చి ఉంటే.. తాము పిల్లలను బడికి పంపకుండా ఇంటి వద్దే చూసుకునే వాళ్లమని వారు చెబుతున్నారు.

సన్మానం కోసం.. పాఠశాలలకు సెలవు ఎందుకు?

ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం తప్పు కాదని.. కానీ అందుకోసం విద్యార్థుల పాఠశాల సమయాన్ని తగ్గించడం ఎంతవరకు సమంజసమని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. సమావేశానికి సగం మంది ఉపాధ్యాయులను పంపి.. మిగిలిన ఉపాధ్యాయులతో పాఠశాలలను నడిపించలేని పరిస్థితి ఉందా? లేక పాఠశాలలను పూర్తిగా మూసివేయాల్సినంత అత్యవసర పరిస్థితి ఏమైనా ఏర్పడిందా? అని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యత గురించి బోధించే విద్యాశాఖే.. పాఠశాలల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల అత్యుత్సాహమా.. ఆదేశాల ఉల్లంఘనా?

పాఠశాలలకు మధ్యాహ్నం సెలవు ప్రకటించేందుకు జిల్లా స్థాయిలో అధికారిక ఉత్తర్వులు ఉన్నాయా? ఉంటే వాటి ఆధారంగా సెలవు ప్రకటించారా? లేక కేవలం మౌఖిక ఆదేశాలతోనే పాఠశాలలను మూసివేశారా?అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మౌఖిక ఆదేశాలతో పాఠశాలలను మూసివేసినట్లయితే.. ఆ ఆదేశాలకు ఆధారం ఏమిటో విద్యాశాఖ అధికారులు స్పష్టం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

కలెక్టర్ దృష్టిసారించాలి

విద్యార్థుల భద్రత, విద్యా సమయం విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం గొప్ప విషయం.. కానీ ఆ రోజున చదువుకునే విద్యార్థుల హక్కు, వారి భద్రత అంతకంటే గొప్ప విషయం కాదా? అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలకు మధ్యాహ్నం సెలవు ప్రకటించడానికి ఎవరి ఆదేశాలు ఉన్నాయి? ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి? ఎంతమంది విద్యార్థులు ఇంటికి పంపబడ్డారు? పాఠశాలల మూసివేతపై జిల్లా విద్యాశాఖకు సమాచారం ఉందా? అనే ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు