మాదకద్రవ్యాల నిర్మూలనకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం

27-11-2026 | 08:13pm

జగిత్యాల డీఈఓ కె. రాము

జగిత్యాల, నవంబర్ 27 ( విజయ క్రాంతి ): సమాజానికి తీవ్ర హానికరంగా మారిన మాదకద్రవ్యాలను(narcotic drugs) (డ్రగ్స్) అందరం కలిసికట్టుగా నిర్మూలించాలని జగిత్యాల జిల్లా విద్యాశాఖాధికారి(Education Department Officer) (డీఈఓ) కె. రాము పిలుపునిచ్చారు. జగిత్యాలలోని టీచర్స్ భవన్ (డి.సి.ఇ.బి.)లో జిల్లా స్థాయి డ్రగ్స్ నివారణ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ కె. రాము మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు మత్తుపదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు,  సమాజంపై ఉందన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. జగిత్యాల జిల్లా ఈగల్ (EAGLE) టీమ్ ఎస్.ఐ. రాజు మాట్లాడుతూ..

డ్రగ్స్ రవాణా, వినియోగంపై సమాచారం అందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1908 గురించి వివరించారు. ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే 1908 కు సమాచారం అందించాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలను వివరించారు.

మత్తుకు బానిసైన వారిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి అందుబాటులో ఉన్న డీ-అడిక్షన్ సెంటర్ల సేవల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా డ్రగ్స్ నివారణ అవగాహన కార్యక్రమ రిసోర్స్ పర్సన్స్ శ్రీకాంత్, లక్ష్మణ్, సురేష్‌లు మండల స్థాయి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డి.డబ్ల్యూ.ఓ ఫీల్డ్ ఆఫీసర్ కొండయ్య, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కె. మహేష్, షీ టీమ్ కానిస్టేబుల్ పూజిత, మండల స్థాయి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు