ఎనిమిది శాఖల అధికారులు గైర్హాజరు...

28-09-2026 | 06:41pm

బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్న తీరు...

తాడ్వాయి, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): అధికారులు ప్రజలకు చేరువలో ఉండాలనే సంకల్పంతో ప్రత్యేకంగా ప్రభుత్వం మండల కేంద్రాలలోని మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రజావాణి(Prajavani) కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. ప్రజల వద్దకే పరిపాలన తీసుకురావాలనే సంకల్పంతో ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి ప్రారంభించింది.

గతంలో డివిజన్ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాలలో మాత్రమే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించేవారు. కానీ అధికారులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్దేశించింది.కానీ అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా తాడువాయి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఎనిమిది శాఖల అధికారులు గైరాజరయ్యారు.

మొత్తం మండలంలో 22 శాఖలు ఉండగా అందులో 14 శాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారు. మిగతా అధికారులు ప్రజావాణికి డుమ్మా కొట్టారు.ఇందులో ఆర్ అండ్ బి శాఖ, ట్రాన్స్కో శాఖ, హార్టికల్చరల్, అటవీశాఖ, పోలీస్ శాఖల అధికారులు ఎలాంటి సమాచారం లేకుండానే గైరాజరయ్యారు. పంచాయతీరాజ్ ఏఈ, హౌసింగ్ ఏఈ, ఎంపీ ఓలు మండల అధికారికి సమాచారం అందించి గైరాజరయ్యారు.

ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో మండల పరిధిలోని ప్రజలు ఏ సమస్య ఉన్న ఆ సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేస్తే అన్ని శాఖల అధికారులు అక్కడే ఉండడంతో వెంటనే ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కానీ అధికారులు తరచూ గైర్హాజర్ కావడంతో సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి ప్రతి శాఖ అధికారి ప్రజావాణిలో హాజరయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భరత్ కుమార్, తహసిల్దార్ శ్వేత వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు