ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి...
ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు..
ఉట్నూర్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి వాస్తవ పరిస్థితులను పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు(ITDA Project Officer Manda Makarandu) అధికారులను ఆదేశించారు.
సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను ఆయన స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఉట్నూర్ మండలం హస్నాపూర్ గ్రామానికి చెందిన రవి తనకి ఆటో లోన్ మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఆదిలాబాద్ మండలం పెద్ద బోరిగామ్ గ్రామానికి చెందిన గ్రామస్తులు తమ గ్రామానికి సి సి రోడ్డు షెడ్డు మంజూరు కోరారు. నార్నూర్ మండలం ఏంపల్లి గ్రామానికి చెందిన మాడవి రాజు తన కు గొర్రెల లోన్ మంజూరు కల్పించామని విజ్ఞప్తి చేశారు. ఉట్నూర్ మండలం చిన్న గంగపూర్ గ్రామానికి చెందిన ఎల్లయ్య తన కు ఇందిరమ్మ ఇల్లు కొరకు దరఖాస్తు అందజేసారు
అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల లబ్ధి, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారం తదితర అంశాలపై తమ వినతిపత్రాలను సమర్పించారు. ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ప్రాజెక్టు అధికారి మంద మకరందు ఆదేశించారు.