మైనర్లకు పెళ్లిళ్లు చేయొద్దు

28-09-2026 | 06:18pm

షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహనా 

బాలికల రక్షణపై ప్రత్యేక చట్టాలు తస్మాత్ జాగ్రత్త

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ మండలంలోని కడ్పల్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల(Kadpal ZPHS School)లో సోమవారం షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు మహిళలు, బాలికలు, యువతుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. షీ టీం ఏఎస్సై తులసిరాం, కానిస్టేబుల్ చాంగుబాయి విద్యార్థులకు మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లపై వివరించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్(SP Paritosh Pankaj), అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి ఆదేశాల మేరకు బాలికలు, మహిళలకు అవగాహన కల్పిస్తున్నట్లు షీ టీం సిబ్బంది తెలిపారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలి

సోషల్ మీడియాను ఉపయోగించే సమయంలో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, పాస్‌వర్డ్‌లను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద లింకులు, సందేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మహిళలు, బాలికల భద్రత కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

బాల్య వివాహాలపై అప్రమత్తత అవసరం

18 ఏళ్లు నిండిన తర్వాతే అమ్మాయిలకు వివాహం చేయాలని, మైనర్లకు పెళ్లిళ్లు చేయరాదని షీ టీం సభ్యులు సూచించారు. ఎవరైనా బాల్య వివాహానికి ప్రయత్నిస్తే టోల్‌ఫ్రీ నంబర్లతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలు లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, ఉమెన్స్ హెల్ప్‌లైన్ 181, సైబర్ హెల్ప్‌లైన్ 1930, పోలీస్ హెల్ప్‌లైన్ 112, షీ టీం హెల్ప్‌లైన్ 9121610750ను సంప్రదించాలని సూచించారు.

ఆకతాయిలు, ర్యాగింగ్‌పై చర్యలు

అమ్మాయిలను వేధించడం, వెంటపడటం, ఆటపట్టించడం, ర్యాగింగ్ చేయడం లేదా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలపై షీ టీం దృష్టి సారిస్తుందని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లలో షీ టీం సభ్యులు మఫ్టీలో పర్యవేక్షిస్తూ అందుబాటులో ఉంటారని చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

యువత, విద్యార్థులు మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశం, ఉపాధ్యాయ బృందం, సర్పంచ్ మల్లగారి విమల విట్టల్ రెడ్డి, ఉప సర్పంచ్ జి. రమేష్, వార్డు సభ్యుడు పి. బస్వానప్ప, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు