మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి రూ.3 కోట్ల బేరసారాలా..?

26-11-2026 | 05:03pm
  1. పదవి మాటున భారీ అక్రమ లావాదేవీలు జరిగాయంటూ బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు
  2. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను టార్గెట్ చేస్తూ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట ధర్నా
  3. చైర్మన్‌ను తొలగించి.. ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్..

ఆలేరు, నవంబర్ 26 (విజయక్రాంతి): ఆలేరు మార్కెట్ కమిటీ(Alair Market Committee) చైర్మన్ పదవి చుట్టూ రాజకీయ వివాదం ముదురుతోంది. చైర్మన్ పదవిని అడ్డం పెట్టుకొని రూ.3 కోట్ల మేర బేరసారాలు జరిగాయంటూ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై బీఆర్ఎస్ నాయకులు సంచలన ఆరోపణలు చేశారు. మార్కెట్ కమిటీని రైతుల ప్రయోజనాల కోసం కాకుండా రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.

ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గురువారం మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.రూ.3 కోట్ల వ్యవహారంపై విచారణ జరపాలి: ఈ సందర్భంగా బీఆర్ఎస్ యాదగిరిగుట్ట, ఆలేరు మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, గంగుల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, పార్టీ జిల్లా నాయకులు చిరబోయిన మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ..

మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కోట్ల రూపాయల బేరసారాలకు వేదికగా మార్చారంటూ ఆరోపించారు. రూ.3 కోట్ల బేరసారాల వెనుక ఉన్న వాస్తవాలను ప్రభుత్వం నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. చైర్మన్‌ను తొలగించాలి.. ఉన్నతస్థాయి విచారణ జరపాలి రైతుల సంక్షేమం, మార్కెట్ అభివృద్ధి, వ్యాపారుల ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన మార్కెట్ కమిటీని వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం దుర్మార్గమని వారు మండిపడ్డారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న చైర్మన్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించి, మార్కెట్ కమిటీ వ్యవహారాలపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేశారు.

ఆందోళనలు ఉధృతం చేస్తాం: చైర్మన్‌కు, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించారు. కోట్ల రూపాయల బేరసారాల ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే స్పందించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు జల్లి నరసింహులు, కౌడే మహేందర్, దయల సంపత్, పత్తి వెంకటేష్, అనంతల శోభన్ రెడ్డి, పన్నాల అంజిరెడ్డి, బొట్ల నరసింహ, బోడ మహేష్, ఎగ్గిడి కృష్ణ, గాజుల వెంకటేష్, కటకం బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు