అమరవీరుడు పోలీస్‌ కిష్టయ్య త్యాగం మరువలేనిది

26-11-2026 | 05:00pm

కరీంనగర్ సిటీ నవంబర్26 (విజయ క్రాంతి ): తెలంగాణ రాష్ట్ర సాధన(Telangana State Achievement) కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు పోలీస్‌ కిష్టయ్య త్యాగం చిరస్మరణీయమని మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. పోలీస్‌ కిష్టయ్య 17వ వర్ధంతిని పురస్కరించుకుని డిసెంబర్‌ 1న నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను గురువారం తన నివాసంలో ముదిరాజ్‌ సంఘం ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోలీస్‌ కిష్టయ్య చేసిన ఆత్మబలిదానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. తన కుటుంబం కంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యానికే ప్రాధాన్యతనిస్తూ ప్రాణాలర్పించిన మహనీయుడని కొనియాడారు. 1969, 1972లో తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాలు పునరావృతం కాకూడదనే సంకల్పంతోనే కిష్టయ్య ఆత్మబలిదానం చేసుకున్నారని పేర్కొన్నారు. కిష్టయ్య, శ్రీకాంతాచారి వంటి ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ చూపించారని తెలిపారు. కిష్టయ్య కుటుంబానికి భూమి కేటాయించడంతో పాటు ఆయన సతీమణికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించారని, పిల్లల ఉన్నత చదువులకు సైతం సహకారం అందించారని గుర్తుచేశారు. ఇటీవల కేటీఆర్‌ కరీంనగర్‌ పర్యటన సందర్భంగా కిష్టయ్య కుటుంబాన్ని పరామర్శించారని పేర్కొన్నారు.

అమరవీరుల కుటుంబాలను తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తామని, వారికి ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని గంగుల స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను, వారి కుటుంబాల త్యాగాలను ఎప్పటికీ మరువబోమన్నారు. డిసెంబర్‌ 1న నిర్వహించనున్న పోలీస్‌ కిష్టయ్య 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి అమరవీరుడికి నివాళులర్పించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గుర్రాల మల్లేశం ముదిరాజ్‌, రాష్ట్ర యువత అధ్యక్షుడు పండుగ బాలు ముదిరాజ్‌, కరీంనగర్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు కొలక నర్సయ్య ముదిరాజ్‌, ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్‌, కొత్తపల్లి మండల అధ్యక్షుడు శ్యామ్‌ ముదిరాజ్‌, హుస్నాబాద్‌ నియోజకవర్గ యువత ఇన్‌చార్జి మద్ది పవన్‌ ముదిరాజ్‌, భిక్షపతి ముదిరాజ్‌, గన్నేరువరం మండల అధ్యక్షుడు మల్లేశం ముదిరాజ్‌, గుడెల్లుల పోచయ్య ముదిరాజ్‌, కంకటి రాజారాం ముదిరాజ్‌, కొత్తపల్లి మండల యువత అధ్యక్షుడు శరత్‌ ముదిరాజ్‌, శ్రావణ్‌ ముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు