కష్టపడి చదివితేనే భవిష్యత్తు: కలెక్టర్ రాహుల్ శర్మ

16-09-2026 | 02:06pm

ప్రయోగాత్మక విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి 

కొంపల్లి పాఠశాలలో  ఆకస్మిక తనిఖీ

విద్యార్థుల ప్రవేశాల పెంపుపై హర్షం

భూపాలపల్లి,సెప్టెంబర్ 16(విజయ క్రాంతి): విద్యార్థులు కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.భూపాలపల్లి మండలం కొంపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Zilla Parishad High School),ప్రీ-ప్రైమరీ పాఠశాలలను జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.విద్యార్థులకు అందుతున్న విద్య,మౌలిక వసతులను పరిశీలించారు.

వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యా సౌకర్యాలపై అవగాహన కల్పించడంతో ప్రవేశాలు దాదాపు 50శాతం పెరగడంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్య మరింత పెంచేందుకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.

విజ్ఞానశాస్త్ర ప్రయోగశాలను పరిశీలించి ప్రయోగాత్మక విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని,అవసరమైన కంప్యూటర్‌ వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి భవిష్యత్తు లక్ష్యాలను తెలుసుకుని,కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.

ప్రీ-ప్రైమరీ పాఠశాలలో అభ్యాసన పద్ధతులు, మధ్యాహ్న భోజనం, మౌలిక వసతులను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో మొక్క నాటి, దాని సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. వంటశాల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో డీఈఓ లలిత, సర్పంచ్ శ్రీకాంత్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు