ధాన్యం లేదు.. బియ్యం సిద్ధం!

16-09-2026 | 05:05am
  1. మిల్లర్ల రివర్స్ రూట్
  2. సీఎంఆర్ బకాయిల చెల్లింపునకు అడ్డదారులు 
  3. ఆంధ్ర నుంచి 1010 రైస్ కొనుగోలు.. ఎఫ్‌సీఐకి సప్తు
  4. మిల్లు మరాడకుండానే బియ్యం తయారీ
  5. గుమస్తాలు, హమాలీల పేరుతో బిల్లింగ్
  6. కరెంట్ బిల్లులు చూస్తే గుట్టురట్టు!

మహబూబాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): కస్టం మిల్లింగ్ రైస్(Custom Milled Rice) కోసం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని విక్రయించిన కొందరు మిల్లర్లు.. ఇప్పుడు అదే కోటా బియ్యాన్ని ఆంధ్ర నుంచి కొనుగోలు చేసి ఎఫ్‌సీఐకి ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

2024 యాసంగి సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ సేకరణ ప్రారంభం కావడంతో చిత్తూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి 1010 రకం బియ్యాన్ని తెలంగాణకు తరలించి కోటా భర్తీ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అప్పట్లో క్వింటాల్ ధాన్యాన్ని రూ.2,400 వరకు అమ్ముకున్న మిల్లర్లు.. ఇప్పుడు అదే ధాన్యానికి బదులుగా క్వింటాల్ బియ్యాన్ని సుమా రు రూ.3,850కు కొనుగోలు చేస్తున్నారని తెలుస్తోంది. ఏపీ నుంచి దిగుమతి చేసుకున్న బియ్యాన్ని నేరుగా భారత ఆహార సంస్థకు(ఎఫ్‌సీ)కు పాసింగ్ అయ్యే విధంగా ముందు గానే ఏర్పాట్లు చేసుకొని లారీలను లారీని ఎఫ్‌సీఐ గోదాములకు తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 

ధాన్యం అమ్ముకున్న మిల్లర్లు!

కొందరు అడ్డదారుల్లో ఈ వ్యవహారానికి తెరలేపినట్లు ప్రచారం సాగుతోంది. సదరు మిల్లుల విద్యుత్ బిల్లులు తనిఖీ చేస్తే అసలు నిజం వెలుగులోకి వస్తుందని పలువురు అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని పూర్తిగా అప్పట్లోనే అమ్ముకున్నారని, ఇప్పుడు నేరుగా ఆంధ్ర నుంచి దొడ్డు బియ్యం (రా రైస్) ఖరీదు చేసి ఎఫ్‌సిఐ గోదాములకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. మిల్లు నడపకుండానే నేరుగా బియ్యం కొనుగోలు చేసి తెచ్చి పెట్టి ఇక్కడే మర ఆడిస్తున్నట్టుగా డ్రామాలకు తెరలేపారు.

దొడ్డి దారిలో ఆంధ్ర నుంచి ఖరీదు చేసి చేస్తున్న బియ్యానికి అక్కడ మిల్లర్లకు నమ్మకస్తులైన గుమస్తాలు, వ్యక్తులు, హమాలీల పేరుపై చెల్లింపులు చేయిస్తున్నట్లు సమాచారం. పూర్తిగా ఇల్లీగల్ దందా చేస్తున్న కొందరు రైస్ మిల్లర్లు, ఎక్క డ కూడా అధికారులకు చిక్కకుండా తమ తెలివితేటలు ప్రదర్శిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మిల్లర్ల బ్యాంకు ఖాతాల నుంచి కాకుండా తమ వద్ద నమ్మకంగా పనిచేసే హమాలీలు, గుమస్తాల బ్యాంకు ఖాతాల నుంచి చెల్లింపులు చేస్తున్నట్లు చెప్తున్నారు. 

అక్కడ నుంచి బిల్లుతో వస్తూ.. మార్గ మధ్యలో చించేస్తూ

ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తున్న బియ్యం లారీలు అక్కడ బిల్లుతో రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. కానీ తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టు దాటగానే ఆ బిల్లులను చింపేస్తున్నట్లు తెలుస్తోంది. బియ్యానికి ఎలాంటి టాక్స్ లేకపోవడంతో ఇక్కడ నేరుగా ఖరీదు చేసిన మిల్లు వద్దకు లారీ రాగానే, మిల్లర్‌కు కేటాయించిన ఎఫ్సీఐ గోదాముకు నేరుగా పంపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్గ మధ్యలో ఎక్కడ కూడా ఎలాంటి తనిఖీలు లేకుండా చూసుకుంటున్నారని చెబుతున్నారు. 

క్వింటా రూ.3,850కి కొనుగోలు

రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ కోసం రైస్ మిల్లర్లకు ఇచ్చిన ధాన్యాన్ని అప్పట్లో ఆంధ్ర కు దొడ్డిదారిలో విక్రయించిన వ్యాపారు ఇప్పుడు, ఆంధ్ర నుండి తెలంగాణకు రైస్ దిగుమతి చేసుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అప్పట్లో 2,400 రూపాయలకు క్వింటాలు చొప్పున ధాన్యాన్ని విక్రయించిన కొందరు వ్యాపారులు ఇప్పుడు 3,850 చొప్పున క్వింటా బియ్యం ఖరీదు చేస్తూ, తమ వ్యాపారంలో ఎలాంటి నష్టం.. కష్టం లేకుండా దొడ్డిదారికి శ్రీకారం చుట్టినట్లు విమర్శలు వస్తున్నాయి.

ధాన్యం అమ్మగా వచ్చిన పైసలతో ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టి, వచ్చిన లాభంతో ఇప్పుడు ఆంధ్ర నుండి బియ్యం కొనుగోలు చేసి పెద్దగా నష్టం లేకుండా, మిల్లు పట్టకుండా రైస్ మిల్లర్లుగా చలామణి అవుతున్నారని, ఇక రైస్ మిల్లులెందుకనే, అలాంటి వారితో మాకు చెడ్డ పేరు వస్తోందని ఏళ్ల తరబడి నిజాయితీగా వ్యాపారం చేస్తున్న రైస్ మిల్లర్లు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు