నేడు అసెంబ్లీలో సీఎం స్పష్టత
22 ఏపై ఏం చేద్దాం..
మంత్రులతో భేటీ
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని నిషేధిత భూములకు(Prohibited lands) సంబంధించిన 22 ఏపై స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 22 ఏ నిషేధిత జాబితా(Prohibited list) ఎప్పటినుంచి ఉందో ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీ(Assembly)లో స్పష్టత ఇవ్వనున్నారు. అందుకు సీఎం మంగళవారం ఎంసీహెచ్‌ఆర్డీలో అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు. బుధవారం అసెంబ్లీలో 22 ఏ అంశంపై చర్చ జరగనున్న నేపథ్యంలో నిషేధిత భూముల(Prohibited lands) విషయంలో నెలకొన్న సమస్యలు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాటికి పరిష్కారం చూపే మార్గాలపై మంత్రుల నుంచి సీఎం రేవంత్‌రెడ్డి సలహాలను తీసుకున్నట్లు సమాచారం.
22 ఏ జాబితాలో ఉన్న భూముల విషయం లో నిజమైన భూ యజమానులు, కొనుగోలుదారులు ఇబ్బందులు పడకుండా అవసరమైన వెసులుబాటు కల్పించే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేసినట్లు సమాచారం. గతంలో 22 ఏ భూముల విషయంలో జరిగిన పరిణామాలు, ప్రస్తుతం ఉన్న సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సభలో వివరించే అవకాశం ఉంది. అదే విధంగా అసెంబ్లీలో 22 ఏ అంశాన్ని ఎలా ప్రస్తావించాలి, ప్రతిపక్షాల విమర్శలకు ఏ విధంగా సమాధానం ఇవ్వాలనే దానిపైనా మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న భూ అక్రమాల అంశాన్ని కూడా రేపు సభలో ప్రస్తావించాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. 22 ఏ భూముల వ్యవహారంలో అసలు సమస్యకు కారణాలేంటి..? గతంలో భూముల కేటాయింపులు, రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి..? ఎవరి హయాంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు..? అనే అంశాలను సభా వేదికగా సీఎం వివరించే అవకాశం ఉంది.
ఒకవైపు ప్రభుత్వ నిర్ణయంపై స్పష్టత ఇవ్వడంతోపాటు, మరోవైపు నిజంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులకు వెసులుబాటు కల్పించేలా పరిష్కార మార్గాలను అన్వేషించినట్లుగా తెలుస్తోంది. బుధవారం అసెంబ్లీలో ఎల్ నినోపై కూడా స్వల్పకాలిక చర్చ జరగనున్నది. మంగళవారం సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వివేక్, సీఎస్ సంజయ్‌జాజుతో పాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.