అనవసర సిజేరియన్లను నియంత్రించాలి
గర్భిణులకు నాణ్యమైన వైద్యం అందించాలి
కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, నవంబర్ 21 (విజయక్రాంతి): తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు(Health Preservation) ప్రాధాన్యం ఇస్తూ సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) ఆదేశించారు. శనివారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ(District Medical and Health Department) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, పురోగతిపై సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
అత్యవసర వైద్య పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ ప్రసవాలు నిర్వహించాలని, అనవసర సిజేరియన్లను నియంత్రించాలని సూచించారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య(Government Primary Health) కేంద్రాల్లో గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ, సాధారణ ప్రసవాలకు అనుకూలమైన వాతావరణం కల్పించాలన్నారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
ప్రభుత్వ ఆరోగ్య సేవలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని సూచించారు. గర్భిణులు, చిన్నారులు, కౌమార బాలబాలికలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అవసరమైన పరీక్షలు, చికిత్సలు అందించాలన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల తాజా గణాంకాలు, నెలవారీ పురోగతిపై వాస్తవ సమాచారంతో నివేదికలను నిర్ణీత సమయంలో సమర్పించాలని స్పష్టం చేశారు.
అనంతరం డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ జిల్లాలో మాతా శిశు ఆరోగ్యం, హైరిస్క్ గర్భిణుల గుర్తింపు, టీకాలు, కుటుంబ నియంత్రణ, క్షయ, కుష్ఠు, మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, పోషకాహార కార్యక్రమాల పురోగతిని వివరించారు.ఈ సమావేశంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరత్నం, ప్రోగ్రామ్ అధికారులు, గైనకాలజిస్టులు, వైద్యాధికారులు, ఎంఎల్హెచ్పీలు, సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.