కేసీఆర్‌ దళిత సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి

11-09-2026 | 02:41pm

డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌ డిమాండ్‌

గణపురం, సెప్టెంబర్‌ 11 (విజయ క్రాంతి): తెలంగాణ దళిత సమాజానికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీలోకి ప్రవేశించే క్రమంలో చోటుచేసుకున్న ఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు.

శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు అసభ్యకర పదజాలంతో దూషించారని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం దళితుడైన గడ్డం ప్రసాద్‌కుమార్‌కు శాసనసభాపతి  పదవి కల్పించిందన్నారుఈ విషయాన్ని జీర్ణించుకోలేక బీఆర్‌ఎస్‌ నాయకులు ఆయనను అవమానించేలా వ్యవహరించారని ఆరోపించారు.

అలాగే, కేసీఆర్‌ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ వద్ద కాంగ్రెస్‌ దళిత నాయకులు చావు డప్పులు మోగించి నిరసన తెలిపిన అనంతరం అక్కడ పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేసిన ఘటన అత్యంత అమానవీయమైందని బట్టు కరుణాకర్‌ అన్నారు. దళితులను అవమానించే చర్యలను తెలంగాణ సమాజం సహించబోదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసీఆర్‌ వెంటనే తెలంగాణ దళిత సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గణపురం మండల కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు