మోటార్లు ఆపితే.. రైతులతో కలిసి వంటావార్పు చేపడతాం
కల్వకుర్తి ఎత్తిపోతలపై మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆగ్రహం
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మోటార్లను ఇష్టానుసారంగా ఆన్–ఆఫ్ చేస్తూ రైతులకు సాగునీరు అందకుండా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, బీరం హర్ష వర్ధన్ రెడ్డి తదితరులు మండిపడ్డారు. శుక్రవారం కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి, మోటార్లను నిలిపివేస్తే రైతులతో కలిసి లిఫ్ట్‌ల వద్ద వంటావార్పు నిర్వహిస్తామని హెచ్చరించారు. శ్రీశైలంలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ ఎత్తిపోతలకు 24 గంటల విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉదయం మోటార్లు నడిపి రాత్రికి విద్యుత్ నిలిపివేయడం వల్లే మోటార్లకు మరమ్మతులు వస్తున్నాయని ఆరోపించారు. ఒక్క మోటారుతో కాలం వెళ్లదీస్తూ రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించడం లేదన్నారు.
నీటిని ఎత్తిపోయేందుకు 24 గంటల విద్యుత్ సరఫరా చేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గత ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసినా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో కాల్వల నిర్మాణంలో ఆశించిన పురోగతి లేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ వైపు కృష్ణా జలాల తరలింపుపై ప్రభుత్వం స్పందించకుండా తెలంగాణ ప్రయోజనాలను విస్మరిస్తోందని విమర్శించారు. ప్రతి పంపింగ్ స్టేషన్ వద్ద టెంట్లు వేసి నిఘా పెడతామని, రైతులకు సాగునీరు అందే వరకు పోరాటం కొనసాగిస్తామని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.