కోటగుళ్లలో వైభవంగా నాగుల చవితి వేడుకలు
నాగేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్పంచ్ రాధిక దంపతులు
గణపురం,(విజయక్రాంతి): ప్రసిద్ధ చారిత్రక కట్టడం, కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం(Bhavani Sahitha Ganapeshwaralayam) కోటగుళ్లలో నాగుల చవితి(Nagula Chavithi) పర్వదిన వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీ భవానీ సహిత గణపేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ భవానీ సహిత గణపేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ ప్రాంగణంలోని నాగేంద్ర స్వామి పుట్ట వద్ద నాగదేవతకు పాలు పోసి దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు సర్పంచ్ దంపతులకు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. నాగుల చవితి సందర్భంగా ఆలయానికి పరిసర గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు, చిన్నారులు, కుటుంబ సభ్యులు నాగేంద్ర స్వామి పుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పాలు పోసి దీపాలు వెలిగించారు. నాగదేవతను పూజిస్తే కుటుంబానికి సుఖశాంతులు, సౌభాగ్యం కలుగుతాయని విశ్వాసంతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.