బారడి పోచమ్మ జాతరకు సర్వం సిద్ధం
కంగ్టి,(విజయక్రాంతి): కంగ్టి మండలం(Kangti Mandal) చాప్టా(కే) గ్రామ శివారులోని బారడి పోచమ్మ ఆలయ(Baradi Pochamma Temple) వార్షికోత్సవ జాతర ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి.ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పూలమాలలు,విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. సాయంత్రం అమ్మవారికి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మూడు దశాబ్దాల క్రితం గ్రామంలో కలరా (హైజా) మహమ్మారి వ్యాపించిన సమయంలో అమ్మవారే తమ గ్రామ ప్రజలను రక్షించిందని గ్రామస్తుల ప్రగాఢ విశ్వాసం.అప్పటి నుంచి ప్రతి ఏటా అమ్మవారి జాతరను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.జాతరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.