ఆగిఉన్న వాహనం.. అదును చూసి దొంగతనం

13-11-2026 | 12:17pm

కోళ్లు దించుతుండగా బ్యాగ్ మాయం

నేరేడుచర్లలో ఘటన

సీసీ కెమెరాలో రికార్డ్ అయిన చోరీ దృశ్యాలు

సూర్యాపేట,(విజయక్రాంతి): బొలెరో వాహనం(Bolero vehicle)లో ఉన్న కోళ్లను దించుతూ పనిలో నిమగ్నం అయిన వారి కళ్లుగప్పి వాహనం ముందు సీటులో ఉన్న బ్యాగును అపహరించాడు ఓ గుర్తుతెలియని వ్యక్తి. ఈ ఘటన గురువారం రాత్రి జిల్లాలోని నేరేడుచర్ల(Nereducherla) పట్టణంలో గల జాన్ పహాడ్ రోడ్డులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేదుచర్లలోని జాన్ పహాడ్ రోడ్డులో మజీద్ కు ఎదురుగా ఉన్న గాంధీ చికెన్ సెంటర్ వద్దకు రాత్రి 9.48 గంటల సమయంలో కోళ్లతో ఓ బొలెరో వాహనం వచ్చింది.

ఇద్దరు వ్యక్తులు వాహనం వెనుక డోర్ ద్వారా కోళ్లను దించే పనిలో నిమగ్నం అయ్యారు. ఇదే అదునుగా భావించిన సుమారు 50 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి, లుంగీ ధరించి వాహనం వద్దకు వచ్చాడు. కొద్దిసేపు అక్కడే నిలబడి ముందు సీటులో ఉన్న బ్యాగును డోర్ లో నుండి అందుకుని రోడ్డు దాటి మజీద్ పక్క నుంచి పరారయ్యాడు. అయితే ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో  పూర్తిస్థాయిలో రికార్డ్ కావడం గమనార్హం. బ్యాగులో నగదు, విలువైన బిల్లులు : చోరీకి గురైన బ్యాగులో నగదుతో పాటు విలువైన బిల్లులు, రశీదులు ఉన్నట్లు చికెన్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. రాత్రి సమయంలో రాకపోకలు తక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని నిందితుడు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని నేరేడుచర్ల పోలీస్ లు తెలిపారు.

మరిన్ని వార్తలు