వైటీపీఎస్‌లో ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలి

11-09-2026 | 12:48pm

చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో బైఠాయించిన ఉద్యోగులు

కేటీపీపీ వద్ద భారీ నిరసనకు టీజీపీఈఏ పిలుపు

గణపురం, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ(Privatization of power utilities), కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం కెటిపిపిలో చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో ఉద్యోగులు బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆగస్టు 29న టీజీపీఈజేఏసీ ప్రతినిధులు(TGPEJAC representatives) ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల సీఎండీలతో నిర్వహించిన సంయుక్త సమావేశంలో పలు సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఆయా సమస్యలపై రెండు వారాల్లో మరోసారి సమావేశం నిర్వహించి చర్చిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది.

అయితే ఇచ్చిన హామీకి విరుద్ధంగా జెన్‌కో యాజమాన్యం యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని(Yadadri Thermal Power Station) బూడిద నిర్వహణ విభాగం, బొగ్గు నిర్వహణ విభాగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు టెండర్లను ఖరారు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు టీజీపీఈజేఏసీ నేతలు ఆరోపించారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేంద్ర టీజీపీఈజేఏసీ పిలుపు మేరకు కేటీపీపీ ప్రధాన ఇంజనీర్ కార్యాలయం వద్ద ఉద్యోగులు పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి విద్యుత్ కేంద్రంలోని బూడిద, బొగ్గు నిర్వహణ విభాగాల ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ టెండర్లను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మన హక్కులు  మన సంస్థలు  మన బాధ్యత” అనే నినాదంతో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే చర్యలను తక్షణమే నిలిపివేయాలని, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టీజీపీఈఏ కేటీపీపీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు