జిల్లా ఏర్పాటుతోనే భూపాలపల్లి అభివృద్ధికి పునాది
- మారుమూల ప్రాంతానికి జిల్లా హోదా
- కేసీఆర్ ముందుచూపుకు నిదర్శనం
- భూపాలపల్లి అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర మరువలేనిది
- పరిపాలనను ప్రజల చెంతకు చేర్చిన ఘనత కేసీఆర్‌దే
- జిల్లా దశాబ్ది వేడుకలలో కేసీఆర్ సేవలను గుర్తు చేసుకున్న: మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి, అక్టోబర్ 10 (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లాను(Bhupalpally District) ఏర్పాటు చేసి మారుమూల ప్రాంత ప్రజలకు పరిపాలనను చేరువ చేయడంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్(BRS Chief KCR) దూరదృష్టి, ప్రత్యేక చొరవ కీలక పాత్ర పోషించాయని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి(Gandra Venkataramana Reddy) అన్నారు. జిల్లా ఆవిర్భావానికి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రోజుల దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం భూపాలపల్లిలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.
హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి వైద్య కళాశాల మీదుగా సమీకృత జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయడంతో భూపాలపల్లి అభివృద్ధికి మార్గం సుగమమైందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ పేరును జిల్లాకు పెట్టడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించిన మహనీయుడికి కేసీఆర్ సముచిత గౌరవం కల్పించారని పేర్కొన్నారు. భూపాలపల్లి ప్రజలు కేసీఆర్‌ను ఎప్పటికీ మరచిపోరని అన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లా కలెక్టరేట్, పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం, ఆసుపత్రి, వైద్య కళాశాల, డిగ్రీ కళాశాల, సింగరేణి కార్మికుల కోసం వెయ్యి నూతన క్వార్టర్లు, పేదల కోసం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. ప్రభుత్వ కార్యాలయాలు జిల్లా కేంద్రంలోనే అందుబాటులోకి రావడంతో ప్రజలకు పరిపాలనా సౌకర్యాలు మెరుగయ్యాయని తెలిపారు. గతంలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులను కలవడానికి వరంగల్ వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం జిల్లా కేంద్రంలోనే అధికారులను కలిసే అవకాశం ఏర్పడిందన్నారు.
తెలంగాణలో గతంలో పది జిల్లాలు ఉండగా, కేసీఆర్ ప్రభుత్వం 33 జిల్లాలను ఏర్పాటు చేసి పాలనను ప్రజలకు చేరువ చేసిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project), మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటి సరఫరా వంటి కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధిలో కీలకమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ప్రధాన పాత్ర పోషించారని, అందుకే ప్రజలు ఆయనను తెలంగాణ బాపుగా భావిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించకుండా రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇస్తోందని గండ్ర విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధితో పోలిస్తే ప్రస్తుత పాలనలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని ఆరోపించారు. విమర్శలు చేయడం కంటే గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని పరిశీలించాలని ప్రతిపక్షాలకు సూచించారు.
జిల్లా ఆవిర్భావ దశాబ్ది సందర్భంగా ప్రజలు అభివృద్ధి ప్రస్థానాన్ని గుర్తు చేసుకోవాలని, ఉత్సవాల్లో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.