పేదల భూములపై పెద్దల కన్ను!
అలంపూర్ చౌరస్తా శివార్లలో 350 ఎకరాల భూములపై అనుమానాలు
అసైన్డ్, సీలింగ్, భూదాన్ భూములపై సమగ్ర విచారణకు డిమాండ్
గద్వాల, నవంబర్ 27 (విజయక్రాంతి): పేదలకు జీవనాధారం కల్పించేందుకు ప్రభుత్వం కేటాయించిన భూములపై పెద్దల కన్ను పడిందా? పేదల భూములు పరులపాలవుతున్నాయా? అన్న అనుమానాలు అలంపూర్ చౌరస్తా పరిసరాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఉండవల్లి మండలం(Undavelly Mandal) పుల్లూరు గ్రామపంచాయతీ పరిధిలోని అలంపూర్ చౌరస్తా శివార్లలో ఉన్న అసైన్డ్, సీలింగ్, భూదాన్ భూములపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
స్థానికుల సమాచారం ప్రకారం 250సి, 252, 256, 257, 273, 274, 451 తదితర సర్వే నంబర్ల పరిధిలో సుమారు 350 ఎకరాల భూములు ఉన్నట్లు తెలుస్తోంది. అలంపూర్ చౌరస్తా వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతుండటంతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో గతంలో పేదలకు కేటాయించిన భూములపై ఇతరుల ఆధిపత్యం పెరిగిందా? హక్కులు, రికార్డుల్లో మార్పులు జరిగాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రికార్డులపై నిగ్గు తేల్చాలి!
సుమారు 350 ఎకరాల్లో ప్రభుత్వ భూములెన్ని? అసైన్డ్, సీలింగ్, భూదాన్ భూములెన్ని? పేదలకు కేటాయించిన భూములు ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయి? అనే వివరాలను అధికారులు వెల్లడించాల్సిన అవసరం ఉంది. పాత భూ రికార్డులతో పాటు ప్రస్తుత ధరణి రికార్డులను పరిశీలించి సర్వే నంబర్ల వారీగా క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
కలెక్టర్ స్పందించేనా?
ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత కలిగిన రెవెన్యూ అధికారులు ఈ వ్యవహారంపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టారన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి సమగ్ర భూ సర్వే నిర్వహించాలని, అక్రమ ఆక్రమణలు లేదా నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పేదల కోసం కేటాయించిన భూములు పేదల వద్దే ఉన్నాయా? లేక ఇతరుల చేతుల్లోకి వెళ్లాయా? అన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.