స్థానికులకు టోల్ సెగ.. రూ.1,500 పాస్‌పై రగడ!

25-11-2026 | 08:17pm

ఏళ్లుగా ఉన్న మినహాయింపుకు మంగళం..

ఫాస్టాగ్ డబ్బుల కట్‌తో వాహనదారుడి ఆగ్రహం

భిక్కనూర్, 25 నవంబర్ (విజయక్రాంతి): భిక్కనూర్ టోల్ ప్లాజా(Bhikkanoor Toll Plaza) వద్ద స్థానిక వాహనదారులకు కొత్త నిబంధనల వ్యవహారం వివాదానికి దారితీస్తోంది. ఇప్పటివరకు టోల్ చార్జీల నుంచి మినహాయింపు పొందుతున్న స్థానికులు ఇకపై ఏడాదికి రూ.1,500 చెల్లించి పాస్ తీసుకోవాలని సిబ్బంది చెబుతున్నట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఈ విధానంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

పాస్ ఎందుకు తీసుకోవాలి?

భిక్కనూర్, రామేశ్వర్‌పల్లి, తిప్పాపూర్, బస్వాపూర్, ర్యాగట్లపల్లి, గుర్జకుంట, శ్రీ సిద్దరామేశ్వరనగర్, అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి, పెద్దమల్లారెడ్డి, కంచర్ల, కాచాపూర్ తదితర గ్రామాల ప్రజలు నిత్యం టోల్ ప్లాజా మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. కొందరికి జాతీయ రహదారి పక్కనే వ్యవసాయ భూములు ఉండటంతో రోజూ పొలాలకు వెళ్లి రావాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాస్ కోసం డబ్బులు చెల్లించడం తమకు భారంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫాస్టాగ్ డబ్బులు కట్.. వాహనదారుడి ఆగ్రహం

గతంలో స్థానికులు ఎక్స్‌ఎంప్షన్ లైన్‌లో వెళ్లి వాహన ఆర్సీ చూపిస్తే సిబ్బంది అనుమతించేవారని వాహనదారులు చెబుతున్నారు. అయితే బుధవారం కంచర్ల గ్రామానికి చెందిన ఓ వాహనదారుడు ఆర్సీ చూపించినప్పటికీ, మినహాయింపు లేదని ముందుగా చెప్పకుండా ఫాస్టాగ్‌లోని డబ్బులు కట్ చేశారని ఆరోపించారు. ఫోన్‌కు మెసేజ్ రావడంతో సిబ్బందిని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని, దీంతో వాహనాన్ని నిలిపి వాగ్వాదానికి దిగినట్లు తెలిపారు. అనంతరం టోల్ సిబ్బంది ఆయన్ని మేనేజర్ ప్రకాష్ వద్దకు తీసుకెళ్లి మాట్లాడించారు. అయినప్పటికీ పాస్ తీసుకునే ప్రసక్తే లేదని వాహనదారుడు స్పష్టం చేసినట్లు తెలిసింది.

డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలా?

టోల్ ప్లాజాను ఆధునీకరించి ఆటోమేటిక్ విధానంలో వాహనాల రాకపోకలకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి ఈ-పాస్ నిబంధనలు అమల్లోకి వస్తాయన్న సమాచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. గతంలోనూ కాంట్రాక్టర్ మారిన సమయంలో స్థానిక పాస్‌ల పేరుతో ఇబ్బందులు ఎదురవడంతో గ్రామాల ప్రజలు నిరసన తెలిపారని, ఆ తర్వాత స్థానిక వాహనాలకు మినహాయింపు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.

అధికారులు స్పందించాలి

స్థానిక వాహనదారులకు గతంలో ఉన్న మినహాయింపులను కొనసాగించాలని, పాస్‌ల పేరుతో ఇబ్బందులకు గురిచేయవద్దని ప్రజలు కోరుతున్నారు. టోల్ ప్లాజా అధికారులు, పోలీస్ శాఖ స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. డిసెంబర్ 1 నుంచి అమలయ్యే నిబంధనలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు