ఇటుక బట్టీల్లో బాల్యం బందీ?!

23-11-2026 | 05:10am
  1. ఇటుక బట్టీల మాటున అక్రమాల సామ్రాజ్యం..
  2. మగ్గుతున్న బాల్యం.. మోడవుతున్న కార్మికుల బతుకులు...!
  3. విలువైన కలపకు యథేచ్ఛగా కోత.. చెరువుల మట్టి అక్రమంగా తరలింపు
  4. విద్యుత్ అక్రమ వినియోగంపై ఆరోపణలు.. 
  5. అధికారుల పర్యవేక్షణేదీ? 

బాన్సువాడ, నవంబర్ 22 (విజయ క్రాంతి):  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటుక బట్టీల నిర్వహణపై(Illegal Brick Kiln Operations) అనేక అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటుకల తయారీ పరిశ్రమ మాటున బాల కార్మికుల వినియోగం, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికుల శ్రమ దోపిడీ, విలువైన కలప వినియోగం, చెరువుల నుంచి మట్టి అక్రమ తవ్వకాలు, విద్యుత్ అక్రమ వినియోగం వంటి అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ఇన్ని ఆరోపణలు వినిపిస్తున్నా సంబంధిత శాఖల అధికారులు సమగ్ర తనిఖీలు చేపడుతున్నారా? నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు ఎక్కడ? అన్న ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.ఇటుకలు తయారవుతున్నాయా? లేక నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారా? అన్నది తేల్చాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది.బాల్యం అంటే బడిలో చదువులు, ఆటపాటలతో గడపాల్సిన సమయం. కానీ ఇటుక బట్టీల వద్ద చిన్నారులు పనిచేస్తున్నారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చినా క్షేత్రస్థాయిలో వాటి అమలు ఎంతవరకు జరుగుతోందన్నది ప్రశ్నార్థకంగా మారింది.

సంబంధిత అధికారులు ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెలికితీయాల్సిన అవసరం ఉంది.ఒకవైపు బాలల హక్కులు, మరోవైపు కార్మికుల సంక్షేమం, ఇంకోవైపు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలు ముడిపడి ఉన్నప్పటికీ ఇటుక బట్టీల నిర్వహణపై సమగ్ర తనిఖీలు జరగాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కార్మిక శాఖ, అటవీ శాఖ, మైనింగ్ శాఖ, విద్యుత్ శాఖ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడతారా? లేక ఇటుక బట్టీల వ్యవహారం యథావిధిగా కొనసాగుతుందా? వేచి చూడాల్సిందే.

వలస కార్మికులపై శ్రమ దోపిడీ...?

ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన కార్మికులు ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు అందుతున్నాయా? పని గంటలు, నివాసం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారా? కార్మికుల హక్కులను యాజమాన్యాలు గౌరవిస్తున్నాయా? అనే అంశాలపై కార్మిక శాఖ విచారణ చేపట్టాల్సి ఉంది.

కలప వినియోగంపై అటవీశాఖ ఆరా తీసేనా?

ఇటుకల తయారీకి అవసరమైన ఇంధనం కోసం విలువైన కలపను వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కలపను దిగుమతి చేసుకుంటున్నారనే ప్రచారం కూడా ఉంది. అయితే ఆ కలపకు చట్టబద్ధమైన రవాణా పత్రాలు, అవసరమైన అనుమతులు ఉన్నాయా? అటవీ సంపదకు నష్టం వాటిల్లుతోందా? అన్నది అటవీశాఖ అధికారులు తేల్చాల్సి ఉంది.

చెరువుల మట్టికి అక్రమ తవ్వకాల గండం...!

ఇటుకల తయారీకి అవసరమైన మట్టిని చెరువుల నుంచి అనుమతులు లేకుండా తవ్వి తరలిస్తున్నారనే ఆరోపణలు మరోవైపు కలకలం రేపుతున్నాయి. చెరువుల సహజ స్వరూపం దెబ్బతింటే భవిష్యత్తులో సాగునీటి నిల్వలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా? ఎంత పరిమాణంలో తవ్వకాలు జరుపుతున్నారు? రవాణాకు అధికారిక అనుమతులు తీసుకున్నారా? అనే అంశాలపై మైనింగ్, రెవెన్యూ శాఖలు దృష్టి సారించాల్సి ఉంది.

విద్యుత్ శాఖకు తెలియకుండానే వినియోగమా...?

కొన్ని ఇటుక బట్టీల్లో విద్యుత్ కనెక్షన్ల వినియోగంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ కనెక్షన్లు వినియోగిస్తున్నారా? విద్యుత్ మీటర్ల ద్వారా నమోదవుతున్న వినియోగానికి, వాస్తవ వినియోగానికి మధ్య వ్యత్యాసం ఉందా? అనే కోణంలో విద్యుత్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.

జిల్లా అధికారులు స్పందించాలి..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఇటుక బట్టీలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, అనుమతులు, కార్మికుల వివరాలు, బాల కార్మికుల వినియోగం, కలప రవాణా, మట్టి తవ్వకాలు, విద్యుత్ కనెక్షన్లపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు