వేగవంతంగా రోడ్డు పనులు..
డబుల్ రోడ్డు నిర్మాణంతో సౌకర్యవంతమైన ప్రయాణం..
రోడ్డు నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు...
తాడ్వాయి, నవంబర్ 22 (విజయక్రాంతి): ఒకప్పుడు కన్కల్, కరడుపల్లి రోడ్డు అంటేనే భయపడేవారు. కన్కల్, కరడ్ పల్లి గ్రామాల ప్రజలు ప్రతిరోజు తమ అవసరాల నిమిత్తం కామారెడ్డి పట్టణానికి వెళుతుంటారు. ప్రజలు తమ అవసరాలు తీర్చుకోవడానికి కామరెడ్డి పట్టణానికి వెళ్లాల్సిందే.
రోడ్డు అద్వానంగా గుంతల మయమై ఉండడంతో వారి ప్రయాణం నరకప్రాయంగా ఉండేది. కానీ ప్రస్తుతం ఈ రోడ్డు నిర్మాణం పనులు వేగవంతంగా సాగుతున్నాయి. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమి కలాన్ గ్రామం నుంచి వయా కన్కల్, కరడు పల్లి, జనగామ గ్రామాల మీదుగా లింగంపల్లి స్టేజి వరకు డబుల్ రోడ్డును నిర్మిస్తున్నారు. దీంతో ఈ గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అవుతే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుందని అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు నిర్మాణానికి రూ 20 కోట్లు మంజూరు..
దేమి కలాన్ గ్రామం నుంచి లింగంపల్లి స్టేజి గాంధారి రోడ్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao) రూ.20 కోట్ల నిధులు మంజూరు చేయించారు.నిధులు మంజూరు చేయడమే కాదు ఆ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.దీంతో రోడ్డు నిర్మాణం పనులు చురుకుగా సాగుతున్నాయి.రోడ్డు నిర్మాణం పనులు పూర్తి అవుతే గాంధారి,తాడ్వాయి మండలాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగవుతుంది.
వేగవంతంగా రోడ్డు నిర్మాణం పనులు..
దేమికలాన్, లింగంపల్లి రోడ్డు నిర్మాణం పనులు వేగవంతంగా సాగుతున్నాయి. సదరు కాంట్రాక్టర్ పనులు వేగవంతంగా చేయిస్తున్నారు. సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డు గా మారుస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా మట్టిని తవ్వి చదును చేస్తున్నారు. అవసరమైన చోట్ల కల్వర్టులు నిర్మిస్తున్నారు.పనులు మరింత వేగవంతంగా సాగుతుండడం తో ఈ రోడ్డు త్వరగా పూర్తి కాబోతుందని ప్రజలు ఆశిస్తున్నారు.
ఈ రోడ్డు నిర్మాణంతో వేగవంతంగా ప్రయాణం..
ఈ డబుల్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి అవుతే ప్రయాణం మరింత వేగవంతంగా సాగుతుందని ప్రజలు తెలిపారు.గతంలో కరడ్ పల్లి గ్రామం నుంచి కామరెడ్డి పట్టణానికి వెళ్లాలంటేనే అక్కడి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు.రోడ్డు అడుగడుగున గుంతలు పడి ఉండడంతో ద్విచక్ర వాహనదారులు మరీ ఇబ్బందులు పడేవారు.ప్రయాణ సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో కరడుపల్లికి చెందిన చాలా కుటుంబాలు కామారెడ్డి పట్టణంలో ప్రత్యామ్నాయంగా నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. అక్కడే ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. అంటే రోడ్డు పరిస్థితి ఎలా ఉండేనో అర్థం అవుతుందని ప్రజలు వాపోతున్నారు.