43 సార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలుస్తున్న రవికుమార్
దోమకొండ, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తం అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు దోమకొండ మండల కేంద్రానికి చెందిన లక్కబత్తిని రవికుమార్(Ravikumar). కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది జోగుల గంగాధర్‌కు ఆపరేషన్ నిమిత్తం ఒంటిమామిడి ఆర్వీఎం వైద్యశాలలో ఏ పాజిటివ్ రక్తం అవసరమైంది.
కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు(IVF Seva Dal State Chairman Dr. Balu)ను సంప్రదించగా, ఆయన సూచన మేరకు రవికుమార్ స్పందించి సకాలంలో రక్తదానం చేశారు. రవికుమార్ ఇప్పటివరకు 43 సార్లు రక్తదానం చేసి పలువురి ప్రాణాలను కాపాడేందుకు తన వంతు సహకారం అందించారు. అంతేకాకుండా సంవత్సరానికి నాలుగు సార్లు రక్తదానం చేయడంతో పాటు రెండుసార్లు ప్లేట్లెట్స్ కూడా అందజేస్తున్నట్లు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ.. నేటి యువతకు రవికుమార్ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తం అందించడం ద్వారా ప్రాణాలను కాపాడుతున్న రవికుమార్ సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. డబ్బుతో కొనలేని రక్తాన్ని ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అందిస్తూ మానవత్వం చాటుతున్నారని కొనియాడారు.
సమాజంలో ఎంతోమంది ఆర్థికంగా సహాయం చేయగలిగినప్పటికీ, రక్తదానం చేయడానికి ముందుకు రావడం లేదని అన్నారు. రక్తదానానికి డబ్బు అవసరం లేదని, సేవ చేయాలనే మానవత్వం ఉంటే చాలని రవికుమార్ నిరూపిస్తున్నారని తెలిపారు. సకాలంలో రక్తం అందకపోతే అత్యవసర పరిస్థితుల్లో ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని, యువత స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని డాక్టర్ బాలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రక్తదాత రవికుమార్‌ను డాక్టర్ బాలు అభినందించారు.