తల్లి జ్ఞాపకార్థం.. భక్తుల దాహార్తి తీర్చేందుకు ఏడేళ్లుగా సేవ
మానవత్వానికి మించిన సేవ మరొకటి లేదు.. నిమ్మటూరి సాయికృష్ణ సేవలను అభినందించిన మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని
హుజురాబాద్ (విజయక్రాంతి): కన్నతల్లి జ్ఞాపకార్థం హుజురాబాద్కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ నిమ్మటూరి సాయికృష్ణ గత ఏడేళ్లుగా బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలు, భక్తులకు ఉచితంగా తాగునీరు(Free Water) అందిస్తున్నారు. తల్లి రాజేశ్వరి స్మృతిని సేవా కార్యక్రమంగా కొనసాగిస్తూ ఆయన మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
హుజురాబాద్ పట్టణంలోని మారుతీనగర్ బతుకమ్మ ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ వేడుకలకు పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు హాజరవుతారు. ఈ సందర్భంగా తాగునీటి కోసం వారు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన సాయికృష్ణ, తన తల్లి జ్ఞాపకార్థం ఉచిత నీటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ సేవను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్రావు, మున్సిపల్ కమిషనర్ జి. కిషన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. తల్లి జ్ఞాపకార్థం భక్తులకు తాగునీరు అందించడం గొప్ప మానవతా దృక్పథానికి నిదర్శనమన్నారు. గత ఏడేళ్లుగా సేవ కొనసాగించడం అభినందనీయమని, పండుగ వేళ భక్తుల అవసరాలను గుర్తించి స్వచ్ఛందంగా ముందుకు రావడం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
సాయికృష్ణ మాట్లాడుతూ.. బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలు, భక్తులు తాగునీటి కోసం ఇబ్బందులు పడటం గమనించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. తల్లి రాజేశ్వరి జ్ఞాపకార్థం చేపట్టిన ఈ సేవను కొనసాగించడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందన్నారు. భక్తుల దాహార్తిని తీర్చడం ద్వారా తల్లి జ్ఞాపకాలను పదిలంగా నిలుపుకోవడమే తన ఉద్దేశమని చెప్పారు.
తల్లి జ్ఞాపకాలను చిత్రపటాలకే పరిమితం చేయకుండా, ఆమె పేరుతో సమాజానికి ఉపయోగపడే సేవ చేయడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సొల్లు సునీత మాజీ వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల& శ్రీనివాస్, రజక సంఘం అధ్యక్షుడు కొండపాక శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు తులసి లక్ష్మణామూర్తి, శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్,పంజాల నాగరాజు, గోపు సాయి, కొలిపాక వెంకటరాజం, శేఖర్, సాయితో పాటు తదితరులు పాల్గొన్నారు.