అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కల్పించాలి

21-11-2026 | 02:58pm

కరీంనగర్ సిటీ,(విజయక్రాంతి): ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు(Voter Rights) కల్పించే బాధ్యత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై ఉందని భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎస్‌ఐఆర్ కోఆర్డినేటర్ సిరాజ్ హుస్సేన్ అన్నారు. భూపాలపల్లిలో నిర్వహించిన ఓట్ బచావో – దేశ్ బచావో ఎస్‌ఐఆర్ ఫేజ్-3 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఓటు రక్షక్ సేవకుల అప్లికేషన్ వినియోగంపై అవగాహన కల్పించారు. అప్లికేషన్ డౌన్‌లోడ్, నమోదు ప్రక్రియతో పాటు బూత్ స్థాయిలో ఓటర్లకు అందించాల్సిన సేవల గురించి వివరించారు. తెలంగాణలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో సుమారు 90 లక్షలకు పైగా ఓట్లు తొలగించబడినట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, భూపాలపల్లి నియోజకవర్గంలో 35 వేలకుపైగా ఓటర్ల వివరాలు అనామలీస్ డేటా కింద గుర్తించబడ్డాయని తెలిపారు. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నియోజకవర్గంలోని డివిజన్లు, మండలాల వారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు), ఓటు రక్షక్ సేవకులతో సమన్వయం చేసుకోవాలని కోరారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఓటు హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు

ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, దాని పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని సిరాజ్ హుస్సేన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు భట్టు కర్ణాకర్, మున్సిపల్ చైర్మన్ కొమురయ్య, వైస్ చైర్మన్ శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు