1991-ఏక్తా యాత్ర ఫోటోను షేర్ చేసిన పాలెం కార్యకర్తలు

10-11-2026 | 11:38am

బిజినేపల్లి: బీజేపీ చరిత్రలో మైలురాయిగా నిలిచిన 1991 నాటి ఏక్తా యాత్ర నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామం మీదుగా సాగిందని స్థానిక బీజేపీ పాత తరం కార్యకర్తలు   దీనికి సంబంధించిన అరుదైన ఫోటోను  తాజాగా షేర్ చేశారు. 1991 నవంబర్ 10వ తేదీన ఫోటోలో అప్పటి బీజేపీ జాతీయ నాయకులు మురళీ మనోహర్ జోషి, వెంకయ్య నాయుడు, యువ కార్యకర్తగా ఉన్న నేటి ప్రధాని నరేంద్ర మోడీ ప్రచార రథంపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం కనిపిస్తోంది.

దేశ ఐక్యతను చాటే ప్రధాన ఉద్దేశ్యంతో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు డా. మురళీ మనోహర్ జోషి నేతృత్వంలో నరేంద్ర మోడీ ఆర్గనైజరుగా 14 రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర సాగింది. అందులో భాగంగా ఉమ్మడి మహబూబునగర్ జిల్లా కేంద్రం నుండి నాగరుకర్నూలు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వీరు వచ్చారు. సభ అనంతరం ఏక్తా యాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఒరిస్సా వెళ్లినట్లుగా అప్పటి కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో పాలెం ప్రధాన రహదారిపై ఉండటంతో యాత్రకు ఘన స్వాగతం లభించిందని, అప్పటి స్థానిక సీనియర్ బిజెపి నాయకులు నారాయణ రెడ్డి, వెంగళరావు, విష్ణుమూర్తి తదితరులు పాలెం గ్రామంలో చేపట్టిన యాత్రకు నాయకత్వం వహించారు.

మరిన్ని వార్తలు