ప్రజలకు మెరుగైన సేవలు అందించే అధికారులుగా ఎదగాలి
ట్రైనీ డీఎస్పీలతో కరీంనగర్ సీపీ గౌష్ ఆలం
కరీంనగర్ క్రైం, నవంబర్ 23 (విజయక్రాంతి): పోలీసింగ్ అంటే కేవలం నేరాల నియంత్రణ మాత్రమే కాదని, చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రజాసేవలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం అని కరీంనగర్ సిపి గౌష్ ఆలం(CP Goush Alam) తెలిపారు.
పోలీస్ శాఖ శిక్షణలో భాగంగా 6గురు ట్రైనీ డీఎస్పీలు సోమవారం కరీంనగర్ కమిషనరేట్ లో రిపోర్ట్ చేశారు. వీరంతా ఆరు నెలల పాటు శిక్షణలో భాగంగా విధులు నిర్వహించనున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు కేటాయించబడిన ఐదుగురు ట్రైనీ డీఎస్పీలు యెల్లబోయిన రుచిత, కొతురి ప్రణీత్, మహేష్ రెడ్డి పైళ్ల, నిశాంత్ లు కమిషనర్ ను కలిశారు.
ఈ సందర్భంగా సీపీ కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ విభాగాలు, వాటి విధులు, బాధ్యతలు, పోలీస్ శాఖ పనితీరుపై వివరించారు. పోలీస్ స్టేషన్ల నిర్వహణ, కేసుల దర్యాప్తు, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
శిక్షణ సమయంలో సీనియర్ పోలీస్ అధికారుల అనుభవాలను తెలుసుకుంటూ విధి నిర్వహణలోని మెళకువలను నేర్చుకోవాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలని, బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని తెలిపారు. బాధ్యతాయుతమైన, సమర్థవంతమైన పోలీస్ అధికారులుగా ఎదగాలని ట్రైనీ డీఎస్పీలకు సీపీ గౌష్ ఆలం దిశానిర్దేశం చేశారు.