మెరుగైన పనితీరుతో ప్రజల మన్ననలు పొందాలి..

23-11-2026 | 11:25pm

కాళేశ్వరం జోన్ డీఐజీ అంబర్ కిశోర్ ఝా తనిఖీలు

ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని ఆదేశం

ములుగు, నవంబర్ 23 (విజయక్రాంతి): మెరుగైన పనితీరుతో ప్రజల మన్ననలు పొందేందుకు పోలీసులు కృషి చేయాలని కాళేశ్వరం జోన్ డిఐజి అంబర్ కిషోర్ జా(DIG Ambar Kishore Jha) పిలుపునిచ్చారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కాళేశ్వరం జోన్ డీఐజీ అంబర్ కిశోర్ ఝా సోమవారం ములుగు  జిల్లాలోని నార్లపూర్ పోలీస్ స్టేషన్, ములుగు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ అధికారులతో కలిసి డీఐజీకి ఘన స్వాగతం పలికారు.

తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, మాల్ఖానా, ఆయుధాగారం, వివిధ విభాగాల పనితీరు,  సిబ్బంది టర్న్‌అవుట్, క్రమశిక్షణ, యూనిఫాం నిర్వహణ తదితర అంశాలను డీఐజీ క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడి వారి విధి నిర్వహణ, పనితీరు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను తెలుసుకున్నారు. 

అనంతరం పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల పనితీరును పరిశీలించారు. సీసీటీవీ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తూ నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన,  సమర్థవంతమైన, జవాబుదారీతనంతో కూడిన పోలీస్ సేవలు అందించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యత అని పేర్కొన్నారు. పెండింగ్ కేసులను సకాలంలో పరిష్కరించడంతో పాటు నేరస్తుల కంటే ఒక అడుగు ముందుండే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. అదే

విధంగా డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియంత్రణ, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నార్లపూర్ పోలీస్ స్టేషన్, ములుగు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయ ఆవరణలో డీఐజీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఎస్పి మనన్ భట్ ఐపీఎస్, ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్బి ఇన్స్పెక్టర్ ప్రతాప్, పసరా సీఐ పత్తిపాక దయాకర్, నార్లాపూర్ ఎస్ఐ అచ్చ కమలాకర్, ములుగు సీఐ సురేష్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు