పేదలకు రూ. 5 లక్షల బీమా భరోసా ‘ఇందిరమ్మ’ పథకం ప్రారంభం
సర్పంచ్ భూక్య భాస్కర్
నల్లబెల్లి, నవంబర్ 23 (విజయక్రాంతి): పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'ఇందిరమ్మ జీవిత బీమా పథకం(Indiramma Jeevitha Bima Scheme)' ఆన్లైన్ నమోదు ప్రక్రియ సోమవారం నందిగామ గ్రామ పంచాయతీలో ఘనంగా ప్రారంభమైంది. పంచాయతీ కార్యదర్శి రంజిత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ భూక్య భాస్కర్ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి పేద కుటుంబానికి అందాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువచ్చిందని పేర్కొన్నారు. దీని ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ. 5 లక్షల వరకు జీవిత బీమా రక్షణ లభిస్తుందని తెలిపారు. ఆపద సమయంలో కుటుంబాలకు ఇది ఎంతో అండగా నిలుస్తుందని, గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలతో పంచాయతీ కార్యాలయంలో తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కారోబార్ దుర్గనాల రాజు. వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.