బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ రాక

23-11-2026 | 05:30am
  1. మహా పాదయాత్రకు ఏర్పాట్లు పూర్తి..
  2. కరీంనగర్ గాంధీ విగ్రహం నుండి ‘పాదయాత్ర’ షురూ...
  3. వైశ్యా భవన్ వద్ద ప్రజాహోరును ఉద్దేశించి ప్రసంగించనున్న నితిన్ నబీన్

కరీంనగర్, నవంబరు 22 (విజయ క్రాంతి): భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఈనెల 23న కరీంనగర్ కు రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు నితిన్ నబిన్ కరీంనగర్ విచ్చేస్తున్నారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద హెలిప్యాడ్ దిగిన వెంటనే నేరుగా గాంధీ బొమ్మ వద్ద నుండి ప్రారంభమయ్యే మహా పాదయాత్రకు చేరుకోనున్నారు. వైశ్యా భవన్ వద్ద ప్రజా హోరును ఉద్దేశించి నితిన్ నబిన్ ప్రసంగించనున్నారు.

ప్రసంగం ముగిసిన వెంటనే వైశ్యాభవన్, రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, గడియారం సెంటర్, శాస్త్రీ రోడ్, భారత్ టాకీస్ మీదుగా కమాన్ చౌరస్తా వరకు ప్రజలతో కలిసి నితిన్ నబిన్ మహా పాదయాత్ర చేస్తారు. సాయంత్రం 4.30 గంటలకు తిరిగి హెలిప్యాడ్ వద్దకు చేరుకుని హైదరాబాద్ చేరుకుని, అక్కడి నుండి విమానంలో ఢిల్లీకి చేరుకుంటారు. నితిన్ నబిన్ తొలిసారి కరీంనగర్ రానున్న నేపథ్యంలో దాదాపు లక్ష మందితో ‘మహా పాదయాత్ర’ నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్ని ఏర్పాట్లు చేశారు.

గత రెండ్రోజుల నుండి పార్టీ నేతలతో వరుస మీటింగ్ లు పెడుతూ జన సమీకరణ, పాదయాత్ర ఏర్పాట్లు, నగర అలకరణ, ఫ్లెక్సీల ఏర్పాటు వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు. పాదయాత్ర స్థలికి వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు లక్షకు మించి జనం హాజరయ్యేలా బండి సంజయ్ కుమార్ కసరత్తు పూర్తి చేశారు. కరీంనగర్ ను తోరణాలు, జెండాలతో అందంగా అలంకరించారు. రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగులతో  నింపేశారు. మరోవైపు నితిన్ నబిన్ కు వినూత్న రీతిలో స్వాగతం పలికేందుకు బండి సంజయ్ కుమార్ ఏర్పాట్లు చేశారు.

తెలంగాణ కళాకారుల ఆట పాటలు, డప్పు నృత్యాలతో నితిన్ నబిన్ కు ఘన స్వాగతం పలుకుతారు. మరోవైపు మహా పాదయాత్రలో ప్రముఖ రచయిత ఆకుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని కళా బ్రందం ప్రత్యేకంగా ఆట, పాటలతో అలరించేలా ఏర్పాట్లు చేశారు. మహా పాదయాత్రకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు యాత్ర పొడువునా రవాణా, మంచినీటి వసతి సౌకర్యాలను కల్పించారు. దాదాపు లక్షకు పైగా మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. వివిధ సామాజిక సంస్థ, సంఘాల ఆధ్వర్యంలోనూ పాదయాత్ర పొడవునా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి పాదయాత్ర చేసే వారికి నీళ్లు, మజ్జిగ, ఇతర తినుబండారాలను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు