మూడేళ్ల తరువాత పనులు షురూ!
- రెండేళ్లలో పూర్తికానున్న వెంకన్న ఆలయం
- త్వరలో కొండగట్టులోనూ పనులు ప్రారంభం
కరీంనగర్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): టీటీడీ ఆధ్వర్యంలో రూ.20 కోట్ల వ్యయంతో శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని(Sri Venkateswara Temple) కరీంనగర్ నగరంలో నిర్మించనున్నారు. దీనికి సంబంధించి పనులు ప్రారంభమైనయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Former Chief Minister KCR) విజ్ఞప్తి మేరకు.. 2023లో అప్పటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి(AP CM Jagan Mohan Reddy) ఆదేశానుసారం కరీంనగర్ లో రూ.20 కోట్ల వ్యయంతో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం నిర్మాణంకు శ్రీకారం చుట్టారు.
అయితే, పనుల ప్రారంభంలో జాప్యం జరిగింది. మూడేళ్ల తరువాత పనులు ప్రారంభమైనయి. రెండేళ్ల లోపు దేవాలయాన్ని పూర్తి చేసే దిశగా పనులు ప్రారంభమైనయి. అప్పటి ప్రభుత్వం కరీంనగర్ లోని పద్మనగర్ లో 10 ఎకరాల స్థలాన్ని టీటీడీకి కేటాయించింది.
స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కృషితో కరీంనగర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం ముందుకు వచ్చింది. శ్రీవారి ఆలయ నిర్మాణానికి మే 31, 2023న శంకుస్థాపన కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రాంగణంలో తెలంగాణ ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు అందించే విదంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు కూడా. ఆగమశాస్త్రం ప్రకారం నిర్మాణం పనులు మొదలైనాయి. శ్రీ వెంకటేశ్వర ఆలయం యెక్క అంతరాలయం, గోపురాలు, బాహ్యాలయ నిర్మాణాల నమూనాలతోపాటు..
మూల విరాట్టు, పోటు, ప్రసాద వితరణ కేంద్రం ఏర్పాటు కానుంది. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలోనే ఇక్కడ కూడా ఆలయాన్ని నిర్మిస్తామని, ప్రధాన ఆలయంతో పాటు పద్మావతి అమ్మవారు, ఆండాల్ అమ్మవారి ఉప ఆలయాలు మరియు నాలుగు మాడ వీధులు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా టి టి డి ప్రకటించింది.
త్వరలో అంజన్న ఆలయంలో..
ప్రముఖ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో జనవరి 3, 2026 న ఈ పనులకు భూమిపూజచేశారు.
శంకుస్థాపన తర్వాత సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన ఈ పనులకు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 2026 లో తుది ఆమోదం ఇచ్చారు.
‘టీటీడీ బోర్డు ఈ పనుల కోసం రూ. 35.19 కోట్లు మంజూరు చేసింది. ఒకేసారి 2,000 మంది భక్తులు దీక్షలు విరమించేలా సువిశాలమైన దీక్షా విరమణ మండపం నిర్మాణం. ‘ భక్తుల వసతి కోసం 96 గదులతో కూడిన భారీ సత్రం (గెస్ట్ హౌస్) నిర్మాణం చేస్తారు. ప్రస్తుతం ఈ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ సాగుతోంది, ఇది ముగిసిన వెంటనే నిర్మాణ పనులు గ్రౌండ్ లెవెల్లో వేగంగా ప్రారంభం కానున్నాయి.