పెరికసింగారంలో 60 అడుగుల భారీ బతుకమ్మ
* 25 ఏళ్లుగా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న జూకూరి దంపతులు
* గతేడాది 55 అడుగులు.. ఈ ఏడాది 60 అడుగుల బతుకమ్మ
* భారీ బతుకమ్మ కోసం సుమారు 4 క్వింటాళ్ల పూల వినియోగం
కూసుమంచి (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ(Bathukamma Festival)ను ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెరికసింగారం గ్రామంలో వినూత్న రీతిలో జరుపుకుంటున్నారు. గ్రామానికి చెందిన జూకూరి గోపాల్ రావు, విజయలక్ష్మి దంపతులు ఏకంగా 60 అడుగుల ఎత్తైన భారీ బతుకమ్మను పేర్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు.
గత 25 ఏళ్లుగా బతుకమ్మ పండుగ సందర్భంగా భారీ బతుకమ్మలను పేర్చడం ఈ దంపతులు ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రత్యేకత చాటుకునేలా భారీ బతుకమ్మలను రూపొందిస్తున్న వీరు, గత ఏడాది 55 అడుగుల ఎత్తైన బతుకమ్మను పేర్చగా, ఈ ఏడాది మరో ఐదు అడుగులు పెంచి 60 అడుగుల ఎత్తులో తీర్చిదిద్దారు.
ఈ భారీ బతుకమ్మను రూపొందించేందుకు సుమారు నాలుగు క్వింటాళ్ల పూలను సేకరించి వినియోగించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వివిధ రంగుల పూలతో అందంగా పేర్చిన ఈ బతుకమ్మ పండుగ శోభను మరింత పెంచుతోంది.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను చాటిచెప్పేలా జూకూరి దంపతులు పాతికేళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఏటా భారీ బతుకమ్మను పేర్చుతూ తెలంగాణ సంస్కృతిని, పండుగ ప్రాధాన్యతను భావితరాలకు పరిచయం చేసేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. పాతికేళ్ల ఆనవాయితీ.. నాలుగు క్వింటాళ్ల పూలతో 60 అడుగుల భారీ బతుకమ్మ.. పెరికసింగారం గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.