మండుతున్న నిత్యావసర ధరలు?
- ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు
- మండుతున్న నిత్యవసర ధరలు
- రైతులు రైతు కూలీలు శ్రామికులు పనులు లేక పలు ఇబ్బందులు
ఎర్రుపాలెం, అక్టోబర్ 16 (విజయక్రాంతి): మండలంలో ఎల్నినో ప్రభావం(El Niño effect)తో వర్షాభావ పరిస్థితుల వలన ప్రజలు పండుగకు దూరమవుతున్నారు. ఈ సంవత్సరం సాధారణం కన్నా వర్షాలు తక్కువగా కురవడం వలన రైతులు తమ పంటలను పండించలేకపోయారు. పతి సంవత్సరం రైతులు పండించే వరి పత్తి మిర్చి ప్రధాన పంటలతో పాటు వాణిజ్య పంటలు కూడా పండించలేకపోయారు. మండలంలో తక్కువ విస్తీర్ణంలో ముఖ్యంగా బోర్ల కింద మాత్రమే రైతులు ప్రధాన పంటలను ఈ సంవత్సరం సాగు చేశారు.
ఈ పంటలు కూడా ఎలినోనో ప్రభావంతో పంటలు పండు తాయో లేదో తెలియని పరిస్థితి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రైతులు తక్కువగా పంటలు సాగు చేయడంతో రైతులతో పాటు రైతు కూలీలకు పనులు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యవ సాయ ఆధారిత పరిశ్రమలపై ఆధారపడ్డ శ్రామికులు కార్మికులు కూడా సరియైన పనులు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. రైతు కూలీలకు శ్రామికులకు పనులు లభించక పోవడంతో పండగకు పస్తులు ఉండే పరిస్థితి కనిపిస్తోంది.
బడుగులు రోజు వాడుకునే నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటుకుంటున్నాయి. గ్యాస్ ,నూనెలు పంచదార ,బియ్యం , పప్పులు అన్ని వస్తువుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సాధారణ ప్రజలు రైతులు, రైతు కూలీలు, శ్రామికులు పండుగకు చేసుకోవడానికి ఆర్థిక ఇబ్బందులతో పండగకు దూరమవుతున్నారు. సామాన్య ప్రజలు వాడుకునే నిత్యవసర ధరలను తగ్గించి రైతులను, రైతు కూలీలను శ్రామికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.