ప్రతి కుటుంబం బాగుండటమే లక్ష్యం!
- ఆలయాల అభివృద్ధికి రూ.2,500 కోట్లు
- భద్రాచలం అభివృద్ధికి రూ.276 కోట్లు..
- బాసర ఆలయానికి రూ.354 కోట్లు
- ప్రజా సంక్షేమమే మా అజెండా..
- రహదారుల నిర్మాణానికి రూ.90 వేల కోట్లు..
- నాచారం ఆలయానికి రూ.44 కోట్లతో రహదారి
- సంక్షేమ పథకాలతో పేదలకు భరోసా
- విద్యార్థుల భవిష్యత్తే.. మన రాష్ట్ర భవిష్యత్తు
- మరో బీటీ రోడ్డు మంజూరుకు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క హామీ
ఖమ్మం, అక్టోబర్ 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం ఏన్కూరు మండలం నాచారంలోని అద్భుత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన, ఆలయానికి వెళ్లే రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయానికి భవిష్యత్తులో లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రూ.44 కోట్లతో రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే రామదాసు నాయక్ పట్టుదలతో ఈ రహదారికి నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. రహదారి నిర్మాణంతో భక్తులకు సౌకర్యం కలగడమే కాకుండా స్థానికంగా వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి సుమారు రూ.2,500 కోట్లతో పనులు చేపడుతున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాలు, అక్కడి ఆలయాల అభివృద్ధికి రూ.2,000 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి రూ.276 కోట్లు, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధికి రూ.354 కోట్లు కేటాయించినట్లు వివరించారు.
సంక్షేమ పథకాలతో పేదలకు భరోసా
ప్రజల కుటుంబ అవసరాలను తీర్చడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో 1.06 కోట్ల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, 71 లక్షల మంది రైతులకు రైతు భరోసా, 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు వడ్డీలేని రుణాలు, అర్హులైన వారికి సామాజిక భద్రత పింఛన్లు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున సాయం అందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తుకు ప్రత్యేక చర్యలు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహార పథకం అమలు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం పెంచినట్లు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని, వైరా నియోజకవర్గానికి కూడా ఈ పాఠశాలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను కూడా కేటాయించామన్నారు. అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి, ప్రపంచంతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని పేర్కొన్నారు.
రహదారుల నిర్మాణానికి రూ.90 వేల కోట్లు
రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి సుమారు రూ.90 వేల కోట్లతో పనులు చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. విద్యుత్ డిమాండ్ 20 వేల మెగావాట్లకు పైగా పెరిగినా నిరంతర సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత పదేళ్లలో రాష్ట్రంపై సుమారు రూ.8.20 లక్షల కోట్ల అప్పుల భారం పడిందని, ప్రస్తుతం అసలు, వడ్డీల చెల్లింపులకు ప్రతి నెలా సుమారు రూ.6,600 కోట్లు వెచ్చించాల్సి వస్తోందని పేర్కొన్నారు. అయినప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
నీటిని పొదుపుగా వినియోగించాలి
ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గి నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని భట్టి విక్రమార్క హెచ్చరించారు. తాగునీటితోపాటు పశువులు, పక్షుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించాలని ప్రజలకు సూచించారు. భూగర్భ జలాల పరిస్థితిని గమనించి మోటార్లను వినియోగించాలని రైతులను కోరారు. నీటి పొదుపుపై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణుల సూచనలతో ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించాలని పేర్కొన్నారు.
మరో బీటీ రోడ్డు మంజూరుకు హామీ
వైరా నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే పలు రహదారులను మంజూరు చేశామని భట్టి విక్రమార్క తెలిపారు. నాచారం గ్రామం నుంచి జూలూరుపాడు మీదుగా తల్లాడ–భద్రాచలం ప్రధాన రహదారిని కలిపేలా గన్నవరం, నాచారం, భద్రతండా ప్రాంతాలకు ఉపయోగపడే మరో బీటీ రహదారిని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడం, వారి జీవితాల్లో మార్పు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరావు డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు