సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్య పారదర్శకతకు కీలకం
- రాష్ట్ర సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాస్ రావు
- రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో ఆర్టీఏ పై శిక్షణ
ఖమ్మం, నవంబర్ 26(విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం(Right to Information Act) ప్రజలకు ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కల్పించే కీలక సాధనమని తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని ఎంసీఆర్హెచ్ఆర్డీ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో కొత్తగూడెం జిల్లాకు చెందిన 40 మంది అధికారులకు సమాచార హక్కు చట్టం పై నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శిక్షణ కార్యక్రమంలో అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సమాచార అధికారులు తమకు అందిన సమాచార హక్కు దరఖాస్తులను బాధ్యతాయుతంగా పరిశీలించి, చట్ట పరిధిలో ఇవ్వదగిన సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలని సూచించారు. ఇతర శాఖలకు దరఖాస్తులను బదిలీ చేసే సందర్భంలో చట్టంలోని నిబంధనలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సమాచార హక్కు చట్టం యొక్క లక్ష్యాలను ప్రతి అధికారి అర్థం చేసుకుని ప్రజలకు సమాచారాన్ని అందించడంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించాలన్నారు.
ప్రజలకు సమాచారాన్ని అందించడం ప్రభుత్వ అధికారుల బాధ్యత మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే విధానమని ఈ సందర్భంగా వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రాంతీయ శిక్షణ మేనేజర్ వి. ఆనంద్ కుమార్, నోడల్ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ రామమూర్తి, ప్రజాకవి జయరాజ్, శిక్షకులు నవాబ్ పాషా, కొండలు రావు తదితరులు పాల్గొన్నారు.