జీనియస్ క్విజ్ పోటీలో ఫైనల్ కు చేరిన విద్యార్థిని
ఫైనల్లో విజేతగా నిలిస్తే రూ. లక్ష బహుమతి
పాపన్నపేట,నవంబర్26: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన జీనియస్ క్విజ్ పోటీల్లో(Genius Quiz Competitions) పాపన్నపేట మండలం యూసుఫ్ పేట ఉన్నత పాఠశాల(Yusufpet High School) విద్యార్థిని జి.నేహ ఫైనల్ కు చేరుకున్నారు. ఇటీవల పాపన్నపేటలో నిర్వహించిన మండల స్థాయి పోటీల్లో నేహ ఉత్తమ ప్రతిభ కనబరిచి సెమీ ఫైనల్ కు చేరుకున్నారు.
గత గురువారం మెదక్ పట్టణంలో నిర్వహించిన సెమీఫైనల్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఫైనల్ కు చేరుకున్నారు. ఫైనల్ పోటీలలో విజేతగా నిల్చిన వారికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రూ.లక్ష బహుమతి ఇవ్వనున్నారు. తమ విద్యార్థి ఫైనల్ కు చేరుకోవడం పట్ల ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.