గిరిజనుల అభివృద్ధికి అటవీ శాఖ సహకారం
గిరిజన సంఘాల ప్రతినిధులతో డీఎఫ్ఓ బాలమణి సమావేశం
ఆసిఫాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): గిరిజనుల అభివృద్ధి, అటవీ సంరక్షణకు(Forest Conservation) గిరిజన సంఘాలతో సమన్వయంతో పనిచేస్తామని జిల్లా అటవీ అధికారి సీహెచ్. బాలమణి(Forest Officer Ch. Balamani) తెలిపారు. గురువారం గోండ్వానా పంచాయతీ రాయి సెంటర్ ప్రతినిధులు, వివిధ గిరిజన సంఘాల నాయకులతో ఆమె సమావేశమయ్యారు.ఈ సందర్భంగా గిరిజన పండుగల నిర్వహణ, అటవీ వనరుల వినియోగం, అటవీ హక్కుల పరిరక్షణ, గిరిజన గ్రామాల అభివృద్ధిపై చర్చించారు.
జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధి, బొటానికల్ గార్డెన్ ఏర్పాటు, ప్రత్యేక బలహీన గిరిజన సమూహాల (పీవీటీజీ) గ్రామాల్లో రహదారి సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తామని డీఎఫ్ఓ పేర్కొన్నారు.దసరా, దీపావళి వంటి పండుగల సందర్భంగా సంప్రదాయ ఆచారాల కోసం అటవీ ఉత్పత్తులు, కలప వినియోగించే సమయంలో స్థానిక అటవీ అధికారులను సంప్రదించి చట్ట నిబంధనలను పాటించాలని సూచించారు.
అటవీ సంరక్షణలో గిరిజనుల పాత్ర కీలకమని, అటవీ శాఖతో పరస్పర విశ్వాసంతో కలిసి పనిచేస్తే అడవుల సంపదను భవిష్యత్ తరాలకు అందించవచ్చని తెలిపారు.ఈ సమావేశంలో ఆసిఫాబాద్ ఎఫ్డీఓ డాక్టర్ ఎ. అప్పయ్య, మాజీ ఐటీడీఏ చైర్మన్ సిడాం అర్జు మాస్టారు, కొలం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భీమ్రావు, ఆర్జీజీఎస్ ప్రధాన కార్యదర్శి వడవి గుణవంతరావు, వివిధ గిరిజన సంఘాల నాయకులు, సర్పంచులు, ప్రతినిధులు పాల్గొన్నారు.