గొలుసుకట్టు కాలువల పనులు ప్రారంభం
రైతులకు ధన్యవాదాలు తెలిపిన కాటం వెంకటేశం.
చిట్యాల, అక్టోబర్ 16 (విజయ క్రాంతి ): చిట్యాల మండలం పెద్దకాపర్తి పెద్ద చెరువు నుంచి ఆరెగూడెం గూనుగుంట, ముర్సుగూడెం మీదుగా చిన్నకాపర్తి వరకు నీరు చేరేలా కాలువల పనులను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(Nakrekal MLA Vemula Veeresham) సహకారంతో ప్రారంభించినట్లు శుక్రవారం చిట్యాల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం తెలిపారు. కాలువల నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చి సహకరిస్తున్న రైతులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఎల్నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, వర్షపు నీరు వృథా కాకుండా గొలుసుకట్టు కాలువల ద్వారా చెరువులను నింపుకునేందుకు రైతులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. రైతుల సహకారంతో నీటి వనరులను సద్వినియోగం చేసుకొని సాగునీటి అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ముద్దసాని రమణారెడ్డి, పిశాటి మాధవరెడ్డి, రాసమల్ల జానయ్య, సత్తిరెడ్డి, గంట్ల పుల్లారెడ్డితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.