నీళ్లలో విషమా..? నిర్లక్ష్యమా?

11-11-2026 | 05:15am

వెంటాడుతున్న కిడ్నీ వ్యాధి 

బెజ్జూర్, నవంబర్ 10 (విజయక్రాంతి):ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చే వ్యాధిగా భావించిన కిడ్నీ సమస్యలు(Kidney Disease) ఇప్పుడు యువకులు, రైతులు, కూలీలను సైతం పట్టిపీడిస్తున్నాయి.  మండలంలోని పలు గ్రామాల్లో డయాలసిస్(Dialysis) చేయించుకుంటున్న రోగుల సంఖ్య పెరుగుతుండటం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.

ఏటి గూడ, ఇప్పలగూడ, పాపన్నపేట తదితర గ్రామాల నుంచి వారానికి రెండు, మూడు సార్లు కాగజ్నగర్, మంచిర్యాల ఆసుపత్రులకు వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్క కుటుంబంలో ఒకరికి కిడ్నీ వ్యాధి సోకితే వైద్య ఖర్చులు, ప్రయాణ భారంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధి రోజురోజుకు పెరుగుతుండడమే కాకుండా ఇప్పటికే పదుల సంఖ్యలో కిడ్నీ వ్యాధి సోకి మరణించిన సంఘటనలు చోటుచేసుకున్నారు. 

షుగర్, బీపీతో పెరుగుతున్న ముప్పు..

వైద్యుల అభిప్రాయం ప్రకారం షుగర్, బీపీ నియంత్రణలో లేకపోవడం కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణాల్లో ఒకటి. చాలామందికి తమకు షుగర్, బీపీ ఉన్నట్లు తెలియకపోవడం, తెలిసినా క్రమం తప్పకుండా మందులు వాడకపోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. కిడ్నీ వ్యాధి ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడంతో చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. కాళ్లు వాపు, నీరసం, ఆకలి తగ్గడం, మూత్రంలో మార్పులు వంటి లక్షణాలు కనిపించినప్పుడు వైద్యులను సంప్రదించేసరికే వ్యాధి ముదిరే ప్రమాదం ఉంది.

తాగునీటి నాణ్యతపై అనుమానాలు...

మండలంలోని అనేక గ్రామాల ప్రజలు బోరు నీటిపైనే ఆధారపడుతున్నారు. ఈ నీటిలో ఫ్లోరైడ్, లవణాలు ఇతర రసాయనాల శాతం అధికంగా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నీటి వల్లే కిడ్నీ వ్యాధులు వస్తున్నాయా అనే విషయంపై ఇప్పటివరకు శాస్త్రీయ నిర్ధారణ అవసరం. ప్రభుత్వం అన్ని గ్రామాల్లో తాగునీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించి, ఫలితాలను ప్రజలకు వెల్లడించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

నొప్పి నివారణ మందులతోనూ ప్రమాదం...

వ్యవసాయ, కూలీ పనులు చేసేవారు శరీర నొప్పులు వచ్చినప్పుడు వైద్యుల సలహా లేకుండానే మెడికల్ షాపుల్లో లభించే నొప్పి నివారణ మాత్రలను తరచూ వాడుతున్నారు. ఇలాంటి మందులను దీర్ఘకాలం విచ్చలవిడిగా వాడటం కిడ్నీలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అనధికారికంగా ఇచ్చే మందులు, స్టెరాయిడ్లు, నాటు మందుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పురుగుమందులు పిచికారీ చేసే సమయంలో రక్షణ పరికరాలు ఉపయోగించకపోవడం కూడా ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

ఆసుపత్రి ఉన్నా.. అందని పరీక్షలు...

2018లో బెజ్జూర్లో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని స్థానికులు వాపోతున్నారు. కనీసం కిడ్నీ పనితీరును గుర్తించే క్రియాటినిన్ పరీక్షలు కూడా స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో చిన్న పరీక్షల కోసం సైతం 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని చెబుతున్నారు. సకాలంలో పరీక్షలు నిర్వహిస్తే వ్యాధిని తొలిదశలోనే గుర్తించి తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వం స్పందించాలని ప్రజల డిమాండ్...

మండలంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి నాణ్యతపై పరీక్షలు నిర్వహించి నివేదికలు వెల్లడించాలని, ప్రతి నెలా ఉచిత కిడ్నీ, షుగర్, బీపీ పరీక్షల శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. బెజ్జూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన కిడ్నీ పరీక్షల సదుపాయాలతో పాటు డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నొప్పి నివారణ మందులు, స్టెరాయిడ్ల విక్రయాలపై నియంత్రణ చేపట్టాలని కోరుతున్నారు. మండలంలో పెరుగుతున్న కిడ్నీ రోగుల సమస్యను ప్రభుత్వం కేవలం వ్యక్తిగత ఆరోగ్య సమస్యగా కాకుండా ప్రజారోగ్య సమస్యగా పరిగణించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నీటి నాణ్యతపై శాస్త్రీయ పరీక్షలు, వైద్య పరీక్షల విస్తరణ, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి కిడ్నీ వ్యాధుల ముప్పును తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు