లక్ష్యం ఘనం.. అమలులో నిర్లక్ష్యం!

28-11-2026 | 05:20am
  1. తడి, పొడి చెత్తపై కొరవడిన అవగాహన
  2. నిరుపయోగంగా మారిన కంపోస్టు షెడ్లు
  3. పట్టించుకోని అధికారులు.. 
  4. వృథాగా ప్రజాధనం

కౌటాల, నవంబర్ 27 (విజయక్రాంతి): సేంద్రియ ఎరువుల తయారీ ప్రభుత్వ లక్ష్యం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతోంది. తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువులు తయారు చేసేందుకు లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన కంపోస్టు షెడ్లు(Compost Sheds) నిరుపయోగంగా మారుతున్నాయి. గ్రామాల్లో చెత్త సేకరణ జరుగుతున్నప్పటికీ, దానిని వేరు చేసి ఎరువుల తయారీకి వినియోగించడంలో సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అవగాహన కల్పించడంలో విఫలం...

పట్టణాలు, మున్సిపాలిటీల తరహాలోనే గ్రామీణ ప్రాంతాల్లోనూ పారిశుద్ధ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. సేకరించిన వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు తయారు చేసేందుకు గ్రామాల్లో ప్రత్యేకంగా కంపోస్టు షెడ్లను నిర్మించారు. అయితే తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాల్సిన విధానంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంలో పంచాయతీ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది విఫలమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎరువుల తయారీ సంగతి పక్కనపెడితే కనీసం చెత్తను వేరు చేసే ప్రక్రియ కూడా సక్రమంగా సాగడం లేదు.

అలంకారప్రాయంగా కంపోస్టు షెడ్లు...

కౌటాల మండల పరిధిలో మొత్తం 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో లక్షలాది రూపాయలు వెచ్చించి కంపోస్టు షెడ్లను నిర్మించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా నిల్వ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్లాస్టిక్ డబ్బాలు, సీసాలు, పేపర్లు, అట్టముక్కలు, విద్యుత్ పరికరాలు, పాత దుస్తులు తదితర వ్యర్థాలను విడివిడిగా వేసేందుకు సౌకర్యాలు కల్పించారు.

గత ప్రభుత్వం ఇంటింటికీ తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు ఆకుపచ్చ, నీలం రంగు బుట్టలను ఉచితంగా పంపిణీ చేసింది. ప్రతి గ్రామ పంచాయతీకి చెత్త సేకరణ కోసం ట్రాక్టర్ను కూడా అందించింది. అయితే బుట్టల పంపిణీతోనే అధికారులు తమ బాధ్యత ముగిసినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరిస్తున్నప్పటికీ, దానిని వేరు చేసి కంపోస్టు షెడ్లలో వేయకపోవడంతో లక్షలాది రూపాయలతో నిర్మించిన షెడ్లు అలంకారప్రాయంగా మిగిలిపోతున్నాయి.

రైతులకు ఎంతో మేలు..

తడి చెత్తను ప్రత్యేకంగా సేకరించి కంపోస్టు షెడ్లలోని తొట్లలో వేయడం ద్వారా సేంద్రియ ఎరువును తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం గతంలో ప్రతి పంచాయతీలో వానపాములను కూడా కొనుగోలు చేశారు. వానపాముల ద్వారా సేంద్రియ ఎరువు తయారు కావడానికి సుమారు 40 నుంచి 60 రోజుల సమయం పడుతుంది. ప్రారంభంలో కొన్ని చోట్ల ఈ విధానం ద్వారా మంచి ఫలితాలు వచ్చినప్పటికీ, క్రమంగా పర్యవేక్షణ కొరవడటంతో ప్రక్రియ నిలిచిపోయింది.

ప్రస్తుతం మార్కెట్లో 50 కిలోల సేంద్రియ ఎరువు బస్తా ధర సుమారు రూ.650 ఉండగా, గ్రామాల్లోనే తయారు చేస్తే దాదాపు రూ.200కే రైతులకు అందించవచ్చు. దీంతో రైతులకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, నేల సారవంతం పెరిగి పంటల దిగుబడికి కూడా మేలు జరుగుతుంది. అయినప్పటికీ అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

చర్యలు తీసుకుంటాం..

తడి, పొడి చెత్తను వేరు చేయడంపై పలుమార్లు ప్రజలకు అ వగాహన కల్పించాం. కొన్ని గ్రామ పంచాయతీల్లో ఈ విధానం అ మలవుతోంది. తడి చెత్త, వానపాముల సహాయంతో కంపోస్టు షెడ్లలో సేంద్రియ ఎరువుల తయారీ కూడా జరుగుతోంది. మరోసారి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ విధానం పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం.

- కోట ప్రసాద్,

ఇన్చార్జి ఎంపీడీఓ, కౌటాల

మరిన్ని వార్తలు