కోడిపందాల స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి
ఎస్సై రమేష్
బెజ్జూర్ అక్టోబర్ 18 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని సులుగుపల్లి గ్రామ సమీపంలోని గంగరంగూడ ప్రాంతంలో కోడిపందాల స్థావరాల(Cockfighting Ring)పై ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఇప్పటికే పలుమార్లు బైండోవర్ చేసినప్పటికీ కోడిపందాల నిర్వాహకులు, ఆటగాళ్ల తీరు మారడం లేదు. ఈ నేపథ్యంలో ఎస్ఐ రమేష్ నమ్మదగిన సమాచారం మేరకు సలుగుపల్లి గ్రామ శివారులోని గంగారాం గుడా ప్రాంతంలో దాడి నిర్వహించారు. అక్కడ కత్తులు కట్టి, డబ్బులు పందెంగా పెట్టి కోడిపందాలు ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసు సిబ్బంది రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.300 నగదు, మూడు కోళ్లు, రెండు కత్తులను స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.
బెజ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా కోడిపందాలు, జూదాలు లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రమేష్ హెచ్చరించారు. ఇప్పటికే బైండోవర్ చేసిన వ్యక్తులు నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండల ప్రజలు ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా కోడిపందాలు లేదా ఇతర అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్ఐ కే. రమేశ్ సూచించారు.