కోటగుళ్ల ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు
గణపురం, నవంబర్ 24 (విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి సందర్భంగా గణపురం మండల కేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవానీ సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లకు మంగళవారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు గంగాధర్, నాగరాజుల ఆధ్వర్యంలో గణపతి పూజతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, ట్రైనీ డీఎస్పీ నిఖిల్, గణపురం ఎస్‌ఐ బొరగల అశోక్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.
కార్తీక పౌర్ణమి (Karthika Pournami) సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మట్టి దీపాలు వెలిగించి పూజలు చేశారు. దీపాల వెలుగులతో కోటగుళ్ల ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల రద్దీ (Devotees Rush) దృష్ట్యా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.