మోదీ నాయకత్వానికి గ్లోబల్ ప్రశంసలు

24-11-2026 | 12:03pm

న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో భారత్ తన ప్రభావాన్ని మరింత పెంచుకుంటోంది. ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్(Lowy Institute) విడుదల చేసిన ‘ఆసియా పవర్ ఇండెక్స్ 2026’(Asia Power Index 2026)లో భారత్ మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా నిలిచింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఆసియాలో రెండో అత్యంత సమర్థవంతమైన ప్రాంతీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్(Chinese President Xi Jinping) అగ్రస్థానంలో ఉన్నారు.

అగ్రస్థానంలో అమెరికా, చైనా

ఈ నివేదికలో అమెరికా 78.9 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా, చైనా 73.6 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. భారత్ 40.5 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. గత ఏడాదితో పోలిస్తే భారత్ స్కోరు 0.5 పాయింట్లు పెరిగింది. భారత్, చైనా మధ్య శక్తి సామర్థ్యాల వ్యత్యాసం 2018 నుంచి ఇప్పటివరకు అత్యల్ప స్థాయికి చేరడం విశేషం.

భారత్ ఎదుగుదలకు కారణాలివే!

ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యాల విస్తరణ, ఆగ్నేయాసియా దేశాలకు బ్రహ్మోస్ క్షిపణుల విక్రయాలు, పొరుగు దేశాలతో వాణిజ్య సంబంధాల బలోపేతం భారత్ ప్రాంతీయ ప్రాభవాన్ని పెంచాయని నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా దౌత్యపరమైన ప్రభావం, భవిష్యత్ వనరులు, సాంస్కృతిక ప్రభావం వంటి అంశాల్లో భారత్ మెరుగైన స్థానం సాధించింది.

మోదీకి రెండో స్థానం

ఆసియా ప్రాంతీయ నాయకత్వం(Asian regional leadership)పై నిపుణుల అంచనాల్లో ప్రధాని మోదీ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని రెండో స్థానానికి చేరుకున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మొదటి స్థానంలో నిలిచారు. అయితే గల్ఫ్ ప్రాంత సంఘర్షణ సమయంలో భారత్ అనుసరించిన పరిమిత దౌత్య వైఖరి మోదీ అంతర్జాతీయ నాయకత్వంపై అంచనాలను కొంత ప్రభావితం చేసిందని నివేదిక పేర్కొంది. మొత్తంగా 27 దేశాలు, ప్రాంతాలను 131 ప్రమాణాల ఆధారంగా విశ్లేషించి ఈ సూచీని రూపొందించారు. ఆసియాలో భారత్ తన ప్రభావాన్ని క్రమంగా పెంచుకుంటోందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

మరిన్ని వార్తలు