కూలీ డబ్బులకు... బడ్జెట్ నిధులకు లింకు
ములుగు జిల్లా: కూలీ డబ్బులకు బడ్జెట్తో ముడిపెడుతూ అధికారులు 16 నెలలుగా కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు ములుగు జిల్లాలో వెలుగుచూశాయి. జిల్లా వ్యాప్తంగా దోమల నివారణకు మందు పిచికారీ చేసిన కూలీలకు ఇప్పటివరకు డబ్బులు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కూలీలకు బకాయిల చెల్లింపుల్లో జాప్యం జరగడంపై ఆవేదన వ్యక్తమవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లాలో కొంతమంది కూలీలు వ్యవసాయ పనులతో పాటు దోమల మందు పిచికారీ చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. 2025 జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సుమారు వందమంది కూలీలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 123 గ్రామాలు, పలు గొత్తికోయ గూడాల్లో దోమల మందు (Mosquito Spray) పిచికారీ చేశారు. ఇందుకోసం అవసరమైన పంపులు, మందును వైద్య ఆరోగ్యశాఖ అందజేసింది. అయితే ఈ పనులకు సంబంధించి సుమారు రూ.8 లక్షల కూలీ డబ్బులు ఇప్పటికీ చెల్లించలేదు.
కూలీ డబ్బుల కోసం పనులు మానుకుని మరీ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదని బాధితులు వాపోతున్నారు. డబ్బులు వస్తాయనే ఆశతో కిరాణా, కూరగాయల దుకాణాల్లో అప్పులు చేశామని, బకాయిలు చెల్లించకపోవడంతో వ్యాపారులు ఇళ్లకు వచ్చి అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ చిట్టీలు కూడా నిలిచిపోయాయని చెబుతున్నారు. బడ్జెట్ రాలేదనే కారణంతో చెల్లింపులు వాయిదా వేయడం తమను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిందని వాపోతున్నారు.
గత 16 నెలలుగా కూలీ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నామని రేండ్ల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను ఎన్నిసార్లు కలిసినా బకాయిలు అందడం లేదన్నారు. డబ్బులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మంత్రి సీతక్క (Seethakka), సంబంధిత అధికారులు స్పందించి తమ కూలీ డబ్బులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా వ్యాప్తంగా 123 గ్రామాల్లో దోమల మందు పిచికారీ చేసిన మాట వాస్తవమేనని ఇన్చార్జి అసిస్టెంట్ మలేరియా అధికారి జినుకల దుర్గారావు తెలిపారు. 2025 జూన్, జూలై, ఆగస్టు నెలల్లో పిచికారీ చేసిన పనులకు సంబంధించి సుమారు రూ.8 లక్షల బడ్జెట్ కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపించామని చెప్పారు. ఇప్పటివరకు నిధులు విడుదల కాకపోవడంతో కూలీలకు డబ్బులు చెల్లించలేకపోయామని వివరించారు. ఉన్నతాధికారులు ఈ అంశంపై కృషి చేస్తున్నారని, త్వరలోనే నిధులు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.