ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
పాట్నా: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. స్కార్పియో, సరకు రవాణా ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్ని ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మంగళవారం తెల్లవారుజామున లఖిసరాయ్-జముయ్ ప్రధాన రహదారి(Lakhisarai Jamui Highway)పై గుణసాగర్ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే... మోతిహారి నుంచి జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌కు వెళ్తున్న స్కార్పియో ఎదురుగా వచ్చిన సరకు రవాణా ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వాహనం పూర్తిగా ధ్వంసమైంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. గాయపడిన వారిలో చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం.
స్థానికుల సమచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను లఖిసరాయ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి పంపించారు.ప్రమాదానికి గురైన స్కార్పియోలో ముండన కార్యక్రమానికి సంబంధించిన వస్తువులను పోలీసులు గుర్తించారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా చిన్నారికి ముండన కార్యక్రమం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు దేవ్‌ఘర్‌కు వెళ్తున్నట్లు పోలీసుల ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.