పాలనపై శ్రద్ధ లేదు

20-11-2026 | 05:30am
  1. కూకట్‌పల్లి ట్రక్ పార్కింగ్ భూములు వేలం వేయొద్దు
  2. లేదంటే 22, 23 తేదీల్లో నిరాహార దీక్ష చేస్తాం 
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరిక

హైదరాబాద్ సీటీ బ్యూరో, నవంబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకాలనే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) విమర్శించారు. భూముల అమ్మకాలపై ఉన్న శ్రద్ధ పాలనపై లేకపోవడం దురదృష్టకరమన్నారు. కూకట్‌పల్లి ట్రక్ పార్కింగ్ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు.

కూకట్‌పల్లిలోని ట్రక్ పార్కింగ్ స్థలం ప్రభుత్వ భూమి కాదని, ప్రత్యేక ప్రజాప్రయోజనం కోసం ట్రక్ పార్కింగ్ అవసరాలకు సేకరించిన భూమి అని పేర్కొన్నారు. ప్రభుత్వ రికార్డుల్లోనూ అదే ఉందన్నారు. హెచ్‌సీయూ, ఉర్దూ యూనివర్సిటీ, అసైన్డ్, దేవాలయ, పర్యావరణ భూములను కూడా అమ్మకానికి పెడుతున్నారని ఆరోపించారు. కూకట్‌పల్లి ట్రక్ పార్కింగ్ స్థలం వేలాది మంది కార్మికుల జీవనాధారమని, రోజుకు సుమారు వెయ్యి కంటైనర్లకు సంబంధించిన కార్యకలాపాలు ఇక్కడ జరుగుతాయని తెలిపారు.

తక్షణమే ట్రక్ పార్కింగ్ భూముల వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 22, 23 తేదీల్లో జరిగే నిరాహార దీక్షల్లో బీఆర్‌ఎస్ ప్రత్యక్షంగా పాల్గొంటుందని, 25న హెచ్‌ఎండీఏ కార్యాలయ ముట్టడిలోనూ భాగస్వామి అవుతుందని ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కృష్ణారావు,ప్రభాకర్ రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, న్యూ డెమోక్రసీ నేత గోవర్ధన్, రంగారెడ్డి జిల్లా సిపిఎం కార్యదర్శి ఉమామహేష్, టిఆర్‌ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు